పెట్రోల్, డీజిల్ సెగ

17:53 - December 8, 2016

ఢిల్లీ : సామాన్యులకు పెట్రోల్ ధరలు చుక్కలు చూపించబోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అనూహ్యంగా పెరగబోతున్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 80 రూపాయలు దాటుతుందన్న అంచనాలున్నాయి. పెట్రోల్, డీజిల్ సెగ మొదలవుతోంది. రాబోయే కొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోలియం ఉత్పత్తి విషయంలో ఒపెక్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం భారత్ ను వణికిస్తోంది. చమురు ధరలను నియంత్రించే ఉద్దేశంతో జనవరి 1 నుంచి తమ  ఉత్పత్తులు తగ్గించేందుకు ఒపెక్ దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.  రోజుకి 1.2 మిలియన్ బారెళ్ల చొప్పున ఉత్పత్తి తగ్గించాలన్నది  ఒపెక్ లోని 13 దేశాల మధ్య కుదిరిన అంగీకారం. దీంతో చమురు ఉత్పత్తి తగ్గి, ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగే అవకాశం వుంది. రాబోయే మూడు నాలుగు నెలల్లో పెట్రోల్ డీజిల్ ధరలు 5 నుంచి 8 శాతం దాకా పెరిగే అవకాశం వున్నట్టు మార్కెట్ వర్గాలు అంచనాలేస్తున్నాయి. 
80శాతం పైగా ఒపెక్ దేశాల నుంచే దిగుమతి 
భారత్ పెట్రోలియం దిగుమతులకు ఎక్కువగా వెచ్చిస్తోంది. దేశీయ అవసరాల్లో 80శాతం పైగా ఒపెక్ దేశాల నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది.  ప్రస్తుతం ఒపెక్ దేశాలు రోజుకి 34. 24 మిలియన్ బారెళ్ల చొప్పున ఉత్పత్తి చేస్తున్నాయి. దీనిని 32 బారెళ్లకు తగ్గించాలన్నది తాజా ఒప్పందం. ఇది జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది.  ఇప్పటికే ముడి చమురు ధర 50 డాలర్లు దాటింది. ఇది 60 డాలర్లు వరకు పెరగొచ్చన్న అంచనాలున్నాయి. ఈ స్థాయిని దాటితే భారత్ మీద మరింత భారం పడుతుంది. ఇప్పటికే హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర దాదాపు 71 రూపాయలుంది. ఒపెక్ దేశాలు తమ ఉత్పత్తి తగ్గిస్తే హైదరాబాద్ లో పెట్రోల్ ధర 80 రూపాయలు, డీజిల్ ధర 68 రూపాయలకు  పెరగొచ్చన్నది మార్కెట్ వర్గాల అంచనా. 
పతాక స్థాయిలో ముడిచమురు ధరలు 
2012లో అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పతాక స్థాయిలో పెరిగాయి. అప్పట్లో క్రాడాయిల్ ధర 110 డాలర్లు దాటింది.   అక్కడ నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చిన ముడి చమురు ధరలు 2016లో 40 డాలర్లకు పతనమయ్యాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు తగ్గిన్నప్పటికీ ఆ ఫలితాన్ని వినియోగదారులకు అందించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టాక్స్ లు పెంచుకుంటూ వచ్చాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గతంలో పెంచిన టాక్స్ లను తగ్గించి, వినియోగదారులను ఆదుకుంటాయా? ఆ టాక్స్ లు అలాగే కొనసాగిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలను మరింత పెంచుతాయా? అన్నది ఆసక్తికరం. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే, రవాణా చార్జీలు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగే ప్రమాదం వుంది. 

 

Don't Miss