మళ్లీ గళం విప్పనున్న జనసేనాని..

08:35 - December 3, 2016

శ్రీకాకుళం : జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరో జిల్లా సమస్యలపై గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి పవన్‌ ఉత్తరాంధ్రపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఇచ్ఛాపురంలో కిడ్నీ వ్యాధి సమస్యపై ఆయన స్పందించనున్నారు. 
జిల్లాలవారీగా ఉన్న ప్రజా సమస్యలపై పవన్‌ దృష్టి
ప్రజా సమస్యలపై అధ్యయనం 
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రాంతాల వారీగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ...వాటిపై అధ్యయనం చేస్తున్నారు. బహిరంగ సభల ద్వారా .. ఆ సమస్యల పరిష్కారమెప్పుడంటూ  ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాకినాడ.. తిరుపతి.. అనంతపురం జిల్లాలో ఉన్న ప్రజల బాధల గురించి ఇప్పటికే మాట్లాడిన జనసేనాని, తాజాగా శ్రీకాకుళంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. దీనికి ఆరో తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. 
ఇచ్ఛాపురంలో కిడ్నీ వ్యాధి సమస్యపై మాట్లాడనున్న పవన్‌
పవన్‌కల్యాణ్‌ ఈసారి శ్రీకాకుళం జిల్లా.. ఇచ్ఛాపురం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి బారిన పడుతున్న ప్రజల గురించి మాట్లాడనున్నారు. 20 ఏళ్లుగా ఇచ్ఛాపురం నియోజక వర్గం నాలుగు మండలాల్లో దాదాపు 30కి పైగా గ్రామాల్లో ప్రజలు కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు.  వ్యాధికారణంగా అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ప్రాంతంలో నీటి కాలుష్యం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్టు నిపుణులు కూడా వెల్లడించారు. అయినా ఏళ్లు గడుస్తున్నా ఈ సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వం ముందుకు రాలేదు. 
పవన్‌కు సమస్య గురించి తెలిపిన అభిమానులు
అనేక ఏళ్లుగా తమ ప్రాంతంలో ఉన్న ఈ సమస్య గురించి అభిమానులు పవన్‌కు తెలియజేశారు. దీంతో స్పందించిన ఆయన ఆరో తేదీన ఇచ్ఛాపురం వెళ్లి  కిడ్నీ వ్యాధి బాధిత ప్రాంతాలను సందర్శించనున్నారు. అలాగే ఆ ప్రాంత ప్రజలతో స్థానిక మణికంఠ థియేటర్ వద్ద ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇటీవల పార్టీ కార్యకలాపాలను  పెంచిన పవన్ ప్రజా సమస్యలే ప్రధానంగా ముందుకు కదులుతున్నారు. 

Don't Miss