'నోట్ల రద్దు'..వైద్యానికి దారేది..

17:46 - December 7, 2016

మహబూబ్ నగర్ : నోట్ల ఎఫెక్ట్ వ్యక్తిగత సేవలను అందించే హాస్పిటాలిటీ రంగాన్ని కూడా వదలలేదు. పాత నోట్లు చెల్లక, కొత్త నోట్లు దొరక్క.. దొరికినా చిల్లర దొరక్క రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రులలో రోగుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా తయారైంది. ప్రభుత్వాస్పత్రుల్లోని కరెన్సీ కష్టాలపై 10టీవీ ప్రత్యేక కథనం. నోట్ల రద్దు నిర్ణయం ప్రతి రంగంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చివరికి హాస్పిటాలిటీ రంగాన్ని కూడా కరెన్సీ కష్టాలు వదలలేదు. చేతిలో చిల్లిగవ్వ లేక.. ఉన్నా చిల్లర లేక రోగానికి అవసరమైన మందులు కొనలేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కరెన్సీ కొరతతో ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్‌ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇక సామాన్యుల ఆస్పత్రులైనా ప్రభుత్వాస్పత్రిల్లోనే ఇదే పరిస్థితి నెలకొంది.

పరీక్షలు వాయిదా..
తెలంగాణలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రాల్లో ఉన్న పెద్దసుపత్రులతోపాటు పలు హాస్పిటల్స్‌లో రోగులు చిల్లర కొరతను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్న చిన్న పరీక్షలకు కావాల్సిన డబ్బులు లేక పరీక్షలను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో రోగాలు ముదిరిపోయే ప్రమాదం ఉంది. మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రి.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఈ ఆసుపత్రే పెద్ద దిక్కు కావడంతో నిత్యం వందలాది ఇన్ పేషంట్స్.. అవుట్ పేషంట్స్ తాకిడి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. మందులు కొన్నాలన్నా.. అవసరాలు తీర్చుకోవాలన్నా చిల్లర కొరతతో తీర్చుకోలేని దుస్థితి నెలకొంది. కొంత మంది రెండు వేల రూపాయలు ఇస్తున్నా చిల్లర లేకపోవడంతో ఎవరు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోలా కష్టాలు..
రోగుల కష్టాలు ఇలా ఉంటే ఆస్పత్రి నిర్వహణ కష్టాలు మరోలా ఉన్నాయి. కరెన్సీ కొరతతో జనరల్ ఆస్పత్రిలో విద్యుత్ సమస్య తలెత్తుతోంది. జనరేటర్ ఆన్ చేద్దామన్నా.. డిజిల్ కొరతతో ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో పలు సర్జరీలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన వైద్య సిబ్బంది హుటాహుటిన డిజిల్ విక్రయదారుడికి నగదుని చెల్లించి సమస్యను పరిష్కరించరమని వైద్యాధికారులు చెబుతున్నారు. మొత్తమ్మీద చిల్లర కొరతతో అన్ని రకాలుగా రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని.. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిల్లర సమస్యను తీర్చాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Don't Miss