పార్లమెంట్ 12వ రోజు అదే తీరేనా..

10:13 - December 2, 2016

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై 11 రోజులు పూర్తయ్యాయి. ఉభయసభల్లో ప్రతిష్టంభన వరుసగా కొనసాగుతోంది. పెద్దనోట్లు రద్దుపై విపక్షాలు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సభలు పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్నాయి. 12వ రోజు సభ సజావుగా జరుగుతుందా ? లేదా ? అనే సందిగ్ధత నెలకొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ఆరోపణలపై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. మోడీ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చర్చ జరిగే సమయంలో మోడీ సభలోనే ఉండాలని పట్టుబడుతున్నాయి. పెద్దనోట్లు రద్దు..నల్లధనంపై మోడీ బయట మాట్లాడుతున్నారే కానీ సభలో ఎందుకు మాట్లాడడం లేదని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. నోట్ల రద్దుతో క్యూ లైన్ లో మృతి చెందిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా బంగారంపై కేంద్రం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై విపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు పార్లమెంట్ లో ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై కాంగ్రెస్ సభ్యులు చర్చిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన విమాన ఘటనపై లోక్ సభ దద్దరిల్లిన సంగతి తెలిసిందే. దీనిపై టీఎంసీ సభ్యులు నేడు కూడా ఆందోళన చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కోల్ కతాలో ఆర్మీ దళాల మోహరింపుపై ప్రశ్నించే అవకాశం ఉంది. 

Don't Miss