పార్లమెంట్‌లో వాయిదాల పర్వం

22:09 - December 8, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్‌లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉభయ సభల్లోనూ పెద్దనోట్లపైచర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని నరేంద్రమోది సభలో సమాధానం చెప్పాలని విపక్షసభ్యులు గందరగోళం సృష్టించారు. దీనిపై ఎలాంటి చర్చ జరగకుండానే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.
విపక్షాల ఆందోళన 
పెద్దనోట్ల రద్దుపై పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశంపై చర్చ చేపట్టాలని విపక్ష పార్టీల సభ్యులు ఆందోళన చేపట్టారు. పెద్దనోట్ల రద్దుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని... 15రోజులుగా విపక్షాలు సభలో గందరగోళం సృష్టిస్తున్నాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎదురుదాడికి దిగారు.
ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం : ఆజాద్‌ 
వెంకయ్య వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఎంపీ గులాంనబీ ఆజాద్‌ తప్పుబట్టారు. బ్యాంకులు, ఏటీఎంల ముందు నిల్చుని  జనం మృతిచెందడం  ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత సుమారు వంద మందికి పైగా మరణించారని.. వారికి సభలో నివాళులర్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని ఆజాద్‌ విమర్శించారు. సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ రాజ్యసభను శుక్రవారానికి వాయిదా వేశారు.
లోక్‌సభలోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ 
లోక్‌సభలో కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది.  పెద్దనోట్ల రద్దు అంశంపై  సభ ప్రారంభం నుంచే విపక్షాలు ఆంళనకు దిగాయి. సభ్యుల ఆందోళన మధ్య స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ప్రధాని మోది సభకు రావాలని విపక్ష సభ్యులు నినాదాలతో  హోరెత్తించారు. దీంతో సభ మధ్యాహ్నం వరకు రెండు సార్లు సభ వాయిదా పడింది.
నోట్ల రద్దుపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు  
తిరిగి సభ రెండుగంటలకు ప్రారంభమయ్యాక కూడా సభలో ఎలాంటి మార్పు లేదు. తాము చర్చకు సిద్ధమేనని కేంద్రమంత్రి అనంతకుమార్‌ చెప్పారు. 184 నిబంధన ప్రకారం చర్చ జరపాలన్న ఖర్గే డిమాండ్‌ను స్పీకర్‌ తిరస్కరించారు. విపక్ష సభ్యులు నోట్ల రద్దుపై చర్చకు పట్టుబట్టారు. ప్రధాని మోది సభకు రావాలని నినాదాలు చేశారు. 
కాంగ్రెస్ పై జైట్లీ విమర్శలు
2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం నల్లధనం అంశంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ విమర్శించారు. జైట్లీ మాట్లాడుతున్నంత సేపు విపక్ష సభ్యులు నినాదాలు చేశారు.  ప్రతిపక్ష సభ్యుల గందరగోళం నడుమ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. 

 

Don't Miss