పాక్ ప్రధాని ఇమ్రాన్ 'పొదుపు' మంత్రం..

17:37 - August 20, 2018

పాకిస్తాన్‌ : ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రధాని అధికారిక నివాసంలో తాను ఉండబోనని... మిలటరీ సెక్రటరీలో ఓ మూడు పడకల గదుల ఇంట్లో ఉంటానని తెలిపారు. తన సొంత ఇల్లు బెనిగలాలోనే ఉండాలనుకున్నప్పటికీ భద్రతా కారణాల వల్ల సెక్యూరిటీ ఏజెన్సీ ఒప్పుకోవడం లేదన్నారు. ప్రధాని అధికార నివాసంలో 524 మంది పనివాళ్లు, 80 కార్లు, 33 బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లతో పాటు హెలిక్యాప్టర్లు, విమానాలు, విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దారుణమైన పరిస్థితిలో ఉన్న ప్రజలకు వెచ్చించేందుకే నిధులు లేవన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తాను కేవలం ఇద్దరు సర్వెంట్లను మాత్రమే తనతో ఉంచుకుంటానని వెల్లడించారు. ప్రధాని అధికారిక నివాసాన్ని రీసెర్చి యూనివర్సిటీగా మార్చాలని ఆయన ఆదేశించారు. దేశ వ్యాప్తంగా అనవసర ఖర్చులు తగ్గించేందుకు ఇమ్రాన్‌ ఓ కమిటీని వేశారు. గత ప్రధానులు విదేశీ పర్యటనలకు విపరీతంగా ఖర్చు చేశారని ఇమ్రాన్‌ ఆరోపించారు. 650 మిలియన్‌ డాలర్లు ఏం చేశారని ప్రశ్నించారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు వేలంలో పెడతానని వీటిని కొనేందుకు వ్యాపారులు ముందుకు రావాలని ఆహ్వానించారు.

Don't Miss