ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే..

21:18 - December 4, 2016

పంజాబ్ : చేతులు కట్టుకొని కూర్చుంటే ఉగ్రవాదాన్ని ప్రొత్సహించినట్లేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అఫ్గానిస్థాన్‌లో సుస్థిర శాంతి స్థాపనకై అమృత్‌సర్‌లో ఏర్పాటు చేసిన హార్ట్‌ ఆఫ్‌ ఏసియా ఆరో సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటేనే వారికి సహకరిస్తున్న వారిని అంతం చేయగలమని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రదాడులతో అట్టుడుకుతున్న అఫ్గానిస్థాన్‌లో శాంతి స్థాపనే లక్ష్యంగా అమృత్‌సర్‌లో హర్ట్‌ ఆఫ్‌ ఏసియా ఆరో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులతో పాటు ఆసియా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆసియా ప్రాంతానికి ఉగ్రవాద హింస పెనుముప్పుగా మారిందని మోదీ అన్నారు. ప్రజలను భయపెడుతూ రక్తపాతం సృష్టిస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌ను అంతం చేయాలంటే సమిష్టిగా పనిచేయాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అఫ్గానిస్థాన్‌లో శాంతి నెలకొల్పాలంటే మాటలు మాత్రమే సరిపోవని.. సుస్థిరమైన కఠిన చర్యలు అవసరమన్నారు. ఉగ్రవాదులపైనే కాదు వారికి మద్దతు, ఆశ్రయం, ఆర్థికసాయం అందిస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని పాక్‌ను ఉద్దేశించి అన్నారు. ఉగ్రవాదం ప్రపంచానికి పెను ముప్పుగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఆయన.. దీనిపై అన్ని దేశాలు సమిష్టిగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. అఫ్గానిస్థాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ఘనీ కూడా పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. అఫ్గాన్‌ పునర్నిర్మాణానికి 500 మిలియన్‌ డాలర్ల సాయం అందిస్తామన్న పాకిస్థాన్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆయన... ఉగ్రవాదానికి మద్దతిస్తే పాక్‌ నుంచి వచ్చే ఒక్క పైసా తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. హార్ట్‌ ఆఫ్‌ ఏసియా సదస్సుకు 40 దేశాల ప్రతినిధులతో పాటు పాక్‌ ప్రధానమంత్రి, విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ హాజరయ్యారు.

Don't Miss