విమాన మృతుల్లో పాప్‌ సింగర్‌ జునైద్‌ జంషీద్‌..

10:40 - December 8, 2016

పాకిస్థాన్‌ : ఘోర విమాన ప్రమాదం జరిగింది. పాక్‌ విమానయాన సంస్థకు చెందిన పీకె-661 విమానం బుధవారం కుప్పకూలింది. చిత్రాల్‌ నుంచి ఇస్లామాబాద్‌ వెళ్తోన్న ఆ విమానం ఆబోటాబాద్‌ సమీపంలోని కొండల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 48 మంది ప్రయాణీకులు చనిపోయినట్టు అధికారులు భావిస్తున్నారు. మృతుల్లో పాప్‌ సింగర్‌ జునైద్‌ జంషీద్‌ కూడా ఉన్నారు.

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం
పాకిస్థాన్‌లో మరో విమాన ప్రమాదం సంభవించింది. ఆబోటాబాద్‌ దగ్గర పీకె -661 విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. బుధవారం మధ్యాహ్నం 3.30కు చిత్రాల్‌ నుంచి పీకే -661 విమానం బయలుదేరింది. 4.40 నిమిషాలకు ఈ విమానం ఇస్లామాబాద్‌లోని బేనజీర్‌భుట్టో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ కావాల్సి ఉంది. అయితే బయలుదేరిన కొద్దిసేపటికే రాడార్‌ నుంచి సంబంధాలు కోల్పోయింది. సరిగ్గా 4.30కు రాడార్‌ సిగ్నల్స్‌ తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. విమానం కూలిన ప్రాంతంలో మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని అలుముకున్నాయి. సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని షరీఫ్‌ ఆదేశించడంతో సైన్యం రంగంలోకి దిగింది. సైనిక హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టారు.

పీకె661లో 48 మంది ప్రయాణీకులు..43 మృతదేహాలు వెలికితీసిన సైన్యం
విమానం బయలుదేరిన సమయంలో 48 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇందులో 9 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు, ముగ్గురు విదేశీయులు ఉన్నట్టు చెప్పారు. అయితే ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తోన్న ప్రయాణీకులంతా చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. రాత్రి వరకు మొత్తంగా 43 మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన ఐదుగురి కోసం గాలిస్తున్నారు. విమాన ప్రమదానికి ఇంజన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యే కారణం అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రమాదానికి గురైన విమానంలో పాక్‌ పాప్‌సింగర్‌ జునైద్‌ జంషీద్‌
ఆబోటాబాద్‌ దగ్గర పీకే - 661 విమాన ప్రమాదంలో పాకిస్థాన్‌ పాప్‌ సింగర్‌ , మతబోధకుడు జునైద్‌ జంషీద్‌ కూడా ఉన్నారు. పాప్‌ గాయకుడిగా కెరీర్‌ ప్రారంభించిన జునైద్‌... అనతికాలంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. కొన్నాళ్లుగా సంగీతం ద్వారా మతపరమైన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. విమానం ఎక్కడానికి కొద్ది గంటల ముందు దిగిన ఫోటోలను జునైద్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు.

పాక్‌ చరిత్రలోనే ఇదే ఘోర ప్రమాదం
పీకె -661 విమాన ప్రమాదం పాకిస్థాన్‌ విమానయాన చరిత్రలోనే ఘోర ప్రమాదంగా నిలిచింది. 2012లో 200 మంది చనిపోయిన భూజా ఎయిర్‌ బోయింగ్‌ విమాన ప్రమాదం తర్వాత ఇప్పటి వరకు పాక్‌లో చేటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం ఇదే.

Don't Miss