ముగిసిన సీఐటీయూ అఖిలభారత మహాసభలు

08:19 - December 1, 2016

ఒడిశా : నయా ఉదారవాద విధానాలు, మతతత్వ పోకడల కారణంగా ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని సీఐటీయూ మహాసభ ఆందోళన వ్యక్తం చేసింది. కార్మిక, కర్షక, సామాన్య ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తోందని, ఇలాంటి సవాళ్లను దీటుగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. ఒడిశా రాష్ర్టం పూరిలో 5 రోజుల పాటు జరిగిన 15వ అఖిల భారత సీఐటీయూ మహా సభలు ఘనంగా ముగిశాయి. చివరిరోజు సంస్థ నూతన కార్యవర్గాన్ని, భవిష్యత్తు కార్యచరణను ప్రకటించింది. 
పూరీలో మహాసభలు
ఒడిశా రాష్ర్టం పూరీలోని కామ్రేడ్‌ సరూర్‌ ముఖర్జీ నగర్‌ ప్రాంగణంలో 5 రోజుల పాటు జరిగిన సీఐటీయూ అఖిలభారత మహాసభలు దిగ్విజయంగా ముగిశాయి. గడిచిన అనుభవాలు, భవిష్యత్తు పోరాటాలపై మహాసభ లోతుగా చర్చించింది. ప్రజలు, కార్మికులపై పడుతున్న భారాలు, దీర్ఘకాలిక సమస్యలపై పోరాటాలను ఉధృతం చేసి.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మహాసభలో నేతలు నిర్ణయించారు.
ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని నిర్ణయం
ప్రజా సమస్యలు ఉన్న చోట... సీఐటీయూ బాధితుల పక్షాన నిలబడి.. న్యాయం జరిగేలా చూడాలని నేతలు పిలుపునిచ్చారు. ఉత్సాహంగా ఉద్యమాల్లో పాల్గొనేందుకు సమాయత్తం కావాలని సూచించారు. ధరల పెరుగుదల, సామాజిక అణిచివేతలు, స్థానిక సమస్యలపై సవాళ్లను అధిగమించి.. సమిష్టిగా ముందుకెళ్లాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. సీఐటీయూను మరింత విస్తరించి.. కార్మికుల పోరాటాల్లో, సామాన్యులకు గొంతుకగా నిలవాలని పలువురు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. స్వతంత్ర కార్యచరణతో నయా ఉదారవాద విధానాలు, మతతత్వం రాజకీయాలు నడిపే పాలకులపై నిరంతరం పోరాటం చేయాలని సీఐటీయూ 15వ మహాసభ తీర్మానించింది. 
డిసెంబర్‌ 22వ తేదీన దేశవ్యాప్త ఆందోళనలు 
కార్మిక, ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ..డిసెంబర్‌ 22వ తేదీన దేశవ్యాప్త ఆందోళనలు చేయాలని సీఐటీయూ నేతలు నిర్ణయించారు. కార్మికుల పోరాటాలపై ప్రభుత్వ నిర్బంధనాలకు వ్యతిరేకంగా వచ్చే ఏడాది జనవరి 19వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మహాసభ పిలుపునిచ్చింది. ఇక అన్ని ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న స్కీమ్‌ వర్కర్లు తమ డిమాండ్ల సాధనకు దేశవ్యాప్తంగా జనవరి 28వ తేదీన చేస్తున్న సమ్మెకు  సీఐటీయూ మద్దతు ఇవ్వాలని తీర్మానించారు. 
అధ్యక్ష్య, ప్రధాన కార్యద కె. హేమలత, తపన్‌ సేన్‌ 
సీఐటీయూ 15వ జాతీయ మహాసభల్లో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలుగా కే. హేమలత, ప్రధాన కార్యదర్శిగా తపన్‌సేన్‌, కోశాధికారిగా ఎం ఎల్ మాల్కోటియా ఎన్నికయ్యారు. వీరితోపాటు మరో 32 మందితో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. వీరిలో 16 మంది ఉపాధ్యక్షులు, మరో 16 మంది కార్యదర్శులు ఉన్నారు. సుకొమల్‌ సేన్‌ను ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించారు. రెండు తెలుగు రాష్ర్టాల్లోని పలువురికి కౌన్సిల్‌లో అవకాశం కల్పించారు. ఏపీ నుంచి సీహెచ్‌ నర్సింగరావుతోపాటు మరో ఏడుగురికి, తెలంగాణలో ఐదుగురికి స్థానం కల్పించారు. అఖిల భారత కార్యవర్గంలో ఏపీ నుంచి కార్యదర్శిగా గఫూర్‌, వైఎస్‌ ప్రెసిడెంట్‌గా బేబిరాణి, కార్యదర్శిగా సాయిబాబాను ఎన్నుకున్నారు. మొత్తంగా సీఐటీయూ అఖిలభారత మహాసభలు విజయవంతంగా ముగిశాయి.

Don't Miss