ఏపీ అసెంబ్లీలో ‘ఆపరేషన్ గరుడ’ రగడ...

07:04 - September 11, 2018

విజయవాడ : ఆపరేషన్‌ గరుడ.  ఏపీలో అధికారంలోకి రావడానికి బీజేపీ పెట్టుకున్న పేరు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ లబ్ది పొందేందుకు తీసుకొచ్చిన ఆపరేషనే గరుడ. బీజేపీ ఆపరేషన్‌ గరుడను ఏపీ ప్రయోగిస్తోందని బయటపెట్టింది హీరో శివాజీ. ఆపరేషన్‌ గరుడ ప్రయోగించి ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోందని ఆయన పలుమార్లు ఆరోపించారు. గరుడ ఎలా ఉండబోతోందో వీడియో చేసి చూపించారు.  మొన్నటికి మొన్న  ఆపరేషన్‌ గరుడ మరో రూపం దాల్చిందని చెప్పారు.  అతి త్వరలో చంద్రబాబుకు నోటీసులు వస్తాయని.... ముఖ్యమంత్రిని టార్గెట్‌ చేసుకుని రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేయడం కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆయన ప్రధాన ఆరోపణ. 

ఆపరేషన్‌ గరుడపై ఏకంగా ఏపీ అసెంబ్లీలోనూ చర్చకొచ్చింది. సీఎం చంద్రబాబు బీజేపీ ఆపరేషనైన గరుడపై నోరు విప్పారు.  కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్‌ గరుడను చంద్రబాబే సృష్టించారని బీజేపీ నేతలు సభలో అన్నారు. దీంతో కోపోద్రిక్తుడైన చంద్రబాబు... తనను దెబ్బతీసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ గరుడ ప్రయోగిస్తోందని మండిపడ్డారు. అధికారం ఉంది కదా అని కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకుని విపక్షాలను భయపెట్టాలని బీజేపీ నేతలు చూస్తోన్నారని చెప్పారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని బీజేపీ నేతలు  గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం సరైందికాదన్నారు. ఆపరేషన్‌ గరుడకు సంబంధించిన  సాక్ష్యాధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. మోదీ ముసుగు వేసుకుని కొందరు డ్రామాలాడుతున్నారని... ముసుగువీరుల ఆటలు ఏపీలో సాగబోవని ఆయన హెచ్చరించారు. మొత్తానికి ఏపీ అసెంబ్లీలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య ఆపరేషన్‌ గరుడపై మాటలయుద్ధం సాగింది. దీంతో మరోసారి ఆపరేషన్‌ గరుడ తెరపైకి వచ్చింది.

Don't Miss