నోట్ల రద్దు ఎవరి కోసం? ..

07:41 - December 8, 2016

కర్నూలు : పెద్దనోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. పనులు మానుకొని ప్రజలంతా బ్యాంకులచుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గంటలకొద్దీ క్యూలో నిల్చుని అమాయక ప్రజలు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. మరికొన్ని చోట్ల బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో రైతులు ఆందోళనబాట పడుతున్నారు.

యూటీఎఫ్‌, మెడికల్‌ రిప్స్‌, రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో సదస్సు
పెద్దనోట్ల రద్దు - ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కర్నూలులో యూటీఎఫ్‌, మెడికల్‌ రిప్స్‌, రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి.. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ఆయన విఫలప్రయత్నంగా అభివర్ణించారు. మోదీ ఏకపక్ష నిర్ణయంతో సామాన్యులు ఇబ్బందిపడుతున్నారన్నారు. ఇదే సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్సీ గేయానంద్‌ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బ్యాంకుల దగ్గర క్యూలైన్‌లో నిలబడి చనిపోయిన కుటుంబాలకు మోదీ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.

పింఛన్‌ డబ్బులు కోసం వెళ్ళి లచ్చమ్మ మృతి
మెదక్‌ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రానికి చెందిన లచ్చమ్మ అనే వృద్ధురాలు పింఛన్‌ డబ్బులు తీసుకునేందుకు ఎస్‌బీహెచ్‌కు వెళ్లింది. అప్పటికే బ్యాంకు దగ్గర జనం బారులు తీరి ఉండడంతో చేసేదేమిలేక క్యూలో నిల్చుంది. గంటల కొద్దీ ఎండలోనే పడిగాపులు గాసింది. తీరా బ్యాంకు లోపలికి వెళ్తుండగా స్పృహతప్పి కుప్పకూలింది. దీంతో లచ్చమ్మను చికిత్స కోసం నారాయణఖేడ్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో సంగారెడ్డికి తరలించాలని వైద్యులు సూచించారు. హుటాహుటిన సంగారెడ్డికి తీసుకొస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది.

నగదు కోసం రైతులు అష్టకష్టాలు
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌ మండలం దుర్కి గ్రామంలో నగదు కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. దుర్కిలోని సిండికేట్‌ బ్యాంకు దగ్గర రైతులు రాత్రి వరకు క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి దాపురించింది. ఉదయం ఏడు గంటల నుంచి రైతులు బ్యాంకు దగ్గర క్యూలో నిల్చోగా... మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బ్యాంక్‌ అధికారులు డబ్బులు లేవని చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు రహదారిపై బైఠాయించి రస్తారోకో నిర్వహించారు. పోలీసులు జోక్యంతో బ్యాంకు అధికారులు నగదు ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో రాత్రి 9 గంటల వరకు రైతులు క్యూలోనే నిల్చున్నారు.

అనంతపురంలో పలువురు మంత్రుల పర్యటన
అనంతపురంలోని పలు చౌక దుకాణాలు, హోటల్స్‌లో మంత్రి పరిటాల సునీత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వినియోగదారుల సౌకర్యార్ధం స్వైప్‌మిషన్లు ఏర్పాటు చేయాలని షాపు యజమానులకు సూచించారు. అటు రెవెన్యూ భవన్‌లో మంత్రి కామినేని శ్రీనివాస్‌ బ్యాంకర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన సంక్షోభాన్ని త్వరలోనే అధిగమిస్తామని చెప్పారు.

ఎస్‌బీఐ దగ్గర ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న మంత్రి పల్లె
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో నగదు కోసం బ్యాంకుల దగ్గర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. స్థానిక ఎస్‌బీఐ దగ్గర ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 

Don't Miss