'నోటు'..వృద్ధుడి కన్నుమూత..

14:23 - December 4, 2016

చెన్నై : మానవత్వం మంటగలుస్తోంది. సాటి మనిషి ప్రాణప్రాయ స్థితిలో ఉంటే ఆదుకునే నాథుడే కరువైపోతున్నాడు. తమిళనాడు రాష్ర్టం తంజావూరులో ఒక ఘటన అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. 75 ఏళ్ల సుబ్రమణ్యం అనే కౌలు రైతుకు అత్యవసరంగా డబ్బులు అవసరం ఉండటంతో... తంజావూరు జిల్లా పాపనాశంలోని ఇండియన్‌ బ్యాంకుకు తన భార్యతో కలిసి వెళ్లాడు. క్యూ లైన్‌లో నిల్చోవాలని బ్యాంకు అధికారులు సూచించడంతో సుబ్రమణ్యం తన భార్యతో కలిసి క్యూలో నిల్చున్నాడు. ఇంతలోనే సుబ్రమణ్యం స్పృహతప్పి ఒక్కసారిగా కూప్పకూలి ప్రాణాలు వదిలాడు. పక్కనే ఉన్న సుబ్రమణ్యం భార్య ఏడుస్తున్నా.. బ్యాంకులోని వారు ఎవరూ పట్టించుకోలేదు. అందరూ డబ్బుల కోసం క్యూలో నిలబడ్డారు గానీ ఏమైందని ఎవరూ అడగలేదు. కొంతమంది యువకులు తమ సెల్‌ఫోన్లలో ఈ విజువల్స్‌ను చిత్రీకరించారు. దాదాపు గంట తర్వాత అధికారులు అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి.. మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించారు. దీంతో పాపం పండు ముదుసలి అంబులెన్స్‌లో తన భర్త శవాన్ని తీసుకొనివెళ్లింది. ఇంత జరిగినా ఇండియన్‌ బ్యాంకు అధికారులు, సిబ్బంది, అక్కడే ఉన్న ఖాతాదారులు కనీసం ఎవరూ స్పందించలేదు. మాయమైపోతున్న మనిషి విలువలకు ఈ ఘటన అద్దం పడుతోంది.

Don't Miss