'నోట్ల రద్దు' ప్రాణాలు తీస్తున్నాయి..

21:23 - December 4, 2016

ఢిల్లీ : కరెన్సీ కష్టాలు ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు తీశాయి... క్యూలైన్లలో కుప్పకూలినా బాధితులను పట్టించుకునేవారే కరువయ్యారు.. కళ్లముందే ప్రాణాలు వదిలినా కనీసం అంబులెన్స్‌కు కూడా ఫోన్ చేయలేదు.. మాయమైపోతున్న మనిషి విలువలకు ఈ ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

డబ్బుకోసం భార్యతో కలిసి క్యూలో నిలబడ్డ రైతు..
నగదు కోసం క్యూలో నిలబడ్డ ఓ వృద్ధుడు గుండెపోటుతో బ్యాంకులోనే ప్రాణాలు వదిలాడు. తమిళనాడు రాష్ర్టం తంజావూరులో ఈ ఘటన జరిగింది... 75 ఏళ్ల సుబ్రమణ్యం అనే కౌలు రైతు పాపనాశంలోని ఇండియన్‌ బ్యాంకుకు భార్యతో కలిసివచ్చాడు. డబ్బుకోసం క్యూలో నిలబడ్డాడు. కొద్దిసేపు క్యూకట్టాక అనారోగ్యానికి గురయ్యాడు.. లైన్లోనే స్పృహతప్పి పడిపోయాడు. ఇది చూసిన ఆయన భార్యకు ఏంచేయాలోతెలియక కన్నీరుమున్నీరైంది. బ్యాంకులో మనిషి కుప్పకూలిపోయినా అధికారులెవ్వరూ పట్టించుకోలేదు.. సాయం చేయాలని ప్రాధేయపడ్డా కరుణించలేదు.. కనీసం క్యూలోఉన్నవారూ సాయం చేయడానికి ముందుకు రాలేదు.. కొంతమంది యువకులుమాత్రం ఇదంతా వీడియోతీశారు.. చివరికి ఓ వ్యక్తి ఫోన్‌ కాల్‌తో గంటసేపటి తర్వాత అంబులెన్స్ అక్కడకు వచ్చింది.. భర్తతోకలిసి బ్యాంకుకు వచ్చిన ఆమె చివరకు రైతు మృతదేహంతో రోదిస్తూ అక్కడి నుంచి వెనుదిరిగింది.

క్యూలోనే గుండెపోటు..
ఇలాంటి మరో ఘటనే పశ్చిమ బెంగాల్‌లో జరిగింది.. 52 ఏళ్ల కల్లోల్‌ రాయ్‌చౌదురి బాందెల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. క్యూలో నిల్చున్న అతనికి గుండెపోటు వచ్చింది.. భరించలేని నొప్పితో స్పృహతప్పి పడిపోయాడు.. అయినా అక్కడివారు అతనివైపే చూడలేదు.. చౌదురి బాధతో విలవిలలాడుతున్నా తమ డబ్బు డ్రాచేసుకునేందుకే ముందుకు కదిలారు.. ఇలా గంటకుపైగా సమయం గడిచిపోయింది.... ఓ వ్యక్తి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు బాధితున్ని ఆస్పత్రికి తరలించారు.. అప్పటికే కల్లోల్ మృతిచెందాడు.

మానవత్వానికే మచ్చ తెస్తున్న ఈ రెండు సంఘటనలు జనాల స్వార్థానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.. స్పృహ తప్పిన వ్యక్తికి సాయం కోసం కదిలితే తమ క్యూలైన్‌ మిస్‌ అవుతుందనే స్థానికులంతా డబ్బు కోసమే ఆలోచించారు. సాటిమనిషన్న ఆలోచనకూడా లేకుండా జరుగుతున్నది చూస్తూనే ఉండిపోయారు. మాయమైపోతున్న మనిషి విలువలకు ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి.

Don't Miss