మిర్చి 'మంటలోనే వుంది 'మందు'..

11:35 - August 17, 2018

భారతీయ వంటకాలలో   ప్రధాన పాత్ర పచ్చిమిర్చిదే. కూర, పచ్చడి, చారు, సూప్, స్నాక్స్, బజ్జీ ఇలా పచ్చిమిర్చి ఉపయోగాలు ఎన్నో. అసలు పచ్చిమిర్చి లేనిదే స్పైసీ రాదు. స్పైసీ కావాలంటే ఇది వుండాల్సిందే. ఒక్కోసారి కేవలం రూ.10లకే దొరికే మిర్చి మరోసారి 100 అమ్మినా సరే మిర్చి కొనకుండా మానలేం..అసలు మార్కెట్ మిర్చి కొనుగోలు లేని పూర్తవ్వదంటే అతిశయోక్తి కాదు. ఒక విధంగా ఆహార పదార్థాల్లో ఎందెందు చూసినా అందందే పచ్చిమిరప ఉండును అనేంతగా పచ్చిమిర్చి ప్రత్యేకత. ఇది కేవలం స్పైసీని ఇవ్వటమే కాదు..పచ్చిమిర్చిలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని న్యూట్రిషన్ నిపుణులు కూడా చెబుతున్న మాటలు.

ప్రకృతి మనిషికి ఇచ్చే అన్ని రుచులు..
ప్రకృతి ఇచ్చే వన్నీ మనిషి ఉపయోగపడేవే. అలా లభించేవాటిలో అన్ని రుచులు వుంటాయి. ఒక్కోదానిలో ఒక్కోరుచి వుంటుంది. తీపి, వగరు, చేదు,పులుపు వంటి పలు రుచులలో కారం కూడా ఒకటి. మరి కారం అనగానే మనకు ఏం గుర్తుకొస్తుంది. అంటే మిర్చి అని ఠక్కున చెప్పేస్తాం. అన్ని రుచులు శరీరానికి ఉపయోగపడతాయని అందరికీ తెలుసు. అందుకే మనం ఉగాది పచ్చడిలో షడ్రుచులను మేళవించి తింటుంటాం. మరి అన్ని రుచుల్లో అన్ని వున్నప్పుడు కారంలో కూడా శరీరానికి ఉపయోగపడేవి వుంటాయన్నమాటేకదా!..మరి పచ్చిమిర్చి ఘాటులో మనకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

సున్నా కేలరీల మిర్చి..శక్తినిచ్చే మిర్చి ఘాటు..
తింటే నషాళానికి అంటే మిర్చి ఘాటుకు కళ్లు, నోరు జలపాతాలైపోతాయి. ఆ ఘాటుకు శరీరం కొంతసేపు ఆగమాగం అయిపోతుంది. ఊపిరాడనట్లుగా వుంటుంది. కానీ ఈ ఘాటు శరీరానికి మాత్రం మంచి శక్తినిస్తుందంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే రసాయనాలు మన జీవక్రియలను 50 శాతం వేగవంతం చేస్తాయి. దీంతో పచ్చిమిరపకాయలను తిన్న మూడు గంటల పాటు ఈ ప్రభావం ఉంటుంది. మిర్చి తింటే మంట వల్ల చాలావరకూ ఇబ్బంది వుంటుంది. కానీ ఈ మంట శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. పచ్చి మిరపకాయల్లో కేలరీలు సున్నా అనే విషయం అందరికీ తెలియదు. కానీ ఇది మాత్రం నిజం.

మంటలోనే ఉంది మందు..
మిరపకాయలు మంట ఎత్తిస్తాయన్న విషయం తెలుసు కదా. ఈ మంట ఎత్తించే రసాయనమే క్యాప్సేసియన్. ఇది బ్రెయిన్ లోని హైపోదాలమస్ అనే చల్లబరిచే కేంద్రాన్ని ప్రేరేపించడం ద్వారా బాడీ ఉష్ణోగ్రతను పెంచుతుంది.

ప్రొస్టేట్ గ్రంధి సమస్యలకు పచ్చిమిర్చితో..
కేవలం వంటకాలకు మాత్రమే కాక శరీరంలో మిర్చి ఘాటులో వుండే యాంటీ ఆక్సిడెంట్లు ఎంతోమేలు చేస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను ఎప్పటికప్పుడు బయటకు పంపించేస్తాయి. దీంతో రక్షణ లభిస్తుంది. ప్రొస్టేట్ గ్రంధి సమస్యలకు పచ్చిమిరపకాయలు మంచి పరిష్కారం.

మిర్చితో గుండె పదిలం..
గుండెకు పచ్చిమిరప సెక్యూరిటీగా పనిచేస్తుందంటే మీరు నమ్ముతారా...? కానీ నమ్మి తీరాల్సిందే. ప్రమాదకర అథెరోస్కెల్ రోసిస్ ను పచ్చిమిర్చి నివారిస్తుంది. రక్తంలో చెడు కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయులను తగ్గించడం ద్వారా ధమనుల లోపల కొవ్వు ఏర్పడకుండా పచ్చిమిరపలోని రసాయనాలు అడ్డుకుంటాయి. అంతేకాదు చాలామందికి చిన్న దెబ్బ తగిలినా..లేదా ఒత్తిడి కలిగినా రక్తం గడ్డ కడుతుంటుంది. ఈ రక్తం గడ్డకట్టేందుకు దారితీసే ప్లేట్ లెట్ల సమూహం ఏర్పడకుండా పచ్చిమిర్చి నివారిస్తుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు.

సైనస్ కు మిర్చి ఉపయోగం..
ఆయా కాలాలలో వచ్చే పలు సమస్యల్లో జలుబు ప్రధానంగా వుంటుంది. కొందరు సైనస్ తో బాధపడుతుంటారు. జలుబు, సైనస్ ఉన్న వారికి పచ్చిమిరప మంచి సహజ ఔషధం అంటారు నిపుణులు. మిర్చిలో వుండే క్యాప్సేసియన్ ముక్కు లోపలి శ్లేష్మం మెంబ్రేన్లలను ఉత్తేజపరిచి మెంబ్రేన్లకు రక్త సరఫరా జరిగేలా చూస్తుంది. మెంబ్రేన్ అనే టిష్యూలో శ్లేష్మం ఏర్పడంతో సైనస్ అంటారు. క్యాప్సేసియన్ వల్ల రక్త సరఫరా మంచిగా జరిగి మెంబ్రేన్లలో శ్లేష్మం పల్చబడటంతో సైనస్ సమస్యకు ఉపశమనం కలుగుతుంది. మరి దీన్ని బట్టి చూస్తే..పచ్చిమిర్చి కారాన్నే కాదు ఆరోగ్యంలో కూడా మెండు అని ఒప్పుకుని తీరాల్సిందే కదా!..

Don't Miss