బీడీపై చిల్లర పోటు..

17:56 - December 1, 2016

కరీంనగర్ : ఇల్లు గడవక ఒకరు.. స్కూలు ఫీజులు చెల్లించలేక మరొకరు.. నిత్యావసరాల సరుకులు కొనుక్కునేందుకు చిల్లర లేక ఇంకొకరు.. ఇలా బీడీ కార్మికులు పెద్ద నోట్ల రద్దుతో తిప్పలు పడుతున్నారు. బిల్లులు రాకపోవడంతో బీడీ కార్మికుల గుండెల్లో గుబులు పుడుతోంది. 500, వెయ్యినోట్ల రద్దు ప్రభావం బీడీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలిచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్న బీడీ కార్మికులు.. కేంద్ర నిర్ణయంతో ఆగాథంలో పడిపోయారు.

రోజంతా కష్టపడ్డా అరకొర ఆదాయం..పెద్ద నోట్ల రద్దుతో కుదేలైన బీడీ పరిశ్రమ
రోజంతా పనిచేస్తేగానీ పొట్టగడని పరిస్థితి బీడీ కార్మికులది. రోజుకు 14 గంటలు పనిచేసినా.. వచ్చే ఆదాయం వీరి కడుపు నింపదు. నిత్య కష్టంలోనూ దోపిడీ, దౌర్జన్యమే! వీరి అమాయకత్వానికి కేంద్ర నిర్ణయం ఇప్పుడు వీరిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బీడీ కార్మికులకు పెను శాపంగా మారింది. ఈ పరిశ్రమలో ఉన్నంత అతి తక్కువ వేతనం, అధిక శ్రమ దోపిడీ ఏ పరిశ్రమలోనూ లేదంటే అతిశయోక్తి కాదు. ఎన్ని బీడీలు చుడితే వాటి లెక్క ప్రకారమే కూలి ఇస్తారు.

చిల్లర దొరక్క ఇబ్బందుల్లో బీడీ కార్మికులు
అసలే అంతంత మాత్రంగా ఉన్న బీడీ పరిశ్రమలోని ఉపాధి అవకాశాలు..పెద్దనోట్ల రద్దుతో మరింత దయనీయంగా మారాయి. నెలంతా రెక్కలు ముక్కలు చేసుకొని బీడీలు చుట్టే కార్మికులు.. చిల్లర కష్టాలతో తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. బీడీ కంపెనీల ఆర్డర్లపై బీడీలు చుట్టే కార్మికులు..ఆ కంపెనీలు ఇచ్చే నెల జీతంపైనే ఆధారపడతారు. అలాంటిది కంపెనీలు రెండు వేల నోట్లు మాత్రమే చెల్లించడంతో..చిల్లర కోసం నానా అవస్థలు పడుతున్నామంటున్న బీడీ కార్మికులు. వంద రూపాయలకే చిల్లర కరువైన ఈ పరిస్థితుల్లో..రెండు వేల నోటుకు చిల్లర తామెక్కడ నుంచి తేగలమని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణలో దాదాపు 6 లక్షల మంది బీడీ కార్మికులు
తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. కరీంనగర్, జగిత్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో బీడీ పరిశ్రమపై ఆధారపడే వాళ్లు ఎక్కువ. అయితే నెలంతా కష్టపడి వచ్చిన మూడు వేల రూపాయలను పట్టుకొని మార్కెట్‌కి వెళితే..చిల్లర కోసం కష్టాలు తప్పడం లేదని చెబుతున్నారు. బ్యాంకుల్లో రోజుల తరబడి వేచిచేడాల్సి వస్తుందని..ఫలితంగా ఉన్న ఉపాధిని కోల్పోతున్నామని అంటున్నారు.

దాదాపు 2 నెలలుగా అందని డబ్బులు
పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా చోట్ల పరిశ్రమ యాజమాన్యాలు కార్మికులకు చెల్లింపులు నిలిపివేశాయి. కొన్నిచోట్ల 2 నెలల నుంచి బిల్లులు రాకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి డబ్బులు రాకపోవడంతో పిల్లల ఫీజులు, ఇంటి కిరాయిలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బీడీ కార్మికులు ఆవేదన
చివరకు నిత్యావసర సరుకులు కూడా కొనుక్కునేందుకు ఇబ్బందులు ఉన్నాయంటున్నారు బీడీ కార్మికులు. పాత నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు వెళ్తే.. 2 వేలే ఇస్తున్నారని, చిల్లర ఇవ్వడం లేదని వాపోతున్నారు. పనిచేస్తేగాని పొట్టగడవని తాము పని మానుకుని... గంటల తరబడి బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోతే.. తాము బ్రతకడం కష్టంగా ఉంటుందని బీడీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Don't Miss