వేతనాల వేళ..వెతలు..

17:36 - December 1, 2016

హైదరాబాద్ : ఒకటో తారీఖు వచ్చింది. జీతాల కోసం ఉద్యోగులు బ్యాంకుల తలుపు తడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు...సామాన్య ప్రజానీకం డబ్బుల కోసం బ్యాంకుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో బ్యాంకుల వద్ద రద్దీ పెరుగుతోంది. ఈ వారం అంతా భారీ క్యూలైన్లు తప్పేట్లు లేదు. మరోవైపు అధికారులు మంత్రా అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు. కానీ... పరిస్థితి చూస్తే మాత్రం అలా కనబడటం లేదు.

నెల మొదటి వారంలో నగదు కోసం బ్యాంకుల వద్ద క్యూలు
జీతాల వేళ బ్యాంకుల బాట పడుతున్న ఉద్యోగులు..బ్యాంకులను వేధిస్తున్న కరెన్సీ సరఫరా కొరత..ఈ వారం భారీగా పెరగనున్న క్యూ లైన్లు..సకల ఏర్పాట్లు చేశామంటున్న సర్కారు..పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో.. బ్యాంకులు, ఏటీఎంల వద్ద కొంత కాలంగా రద్దీ మళ్లీ పెరుగుతోంది. జీతాల సమయం కావడంతో ఉద్యోగులు నగదు కోసం బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు. దేశంలోని అనేక మంది ఉద్యోగులు, శ్రామికులకు ఒకటో తారీఖు నుంచి దశల వారీగా జీతాలు, వేతనాలు చెల్లిస్తారు. దీంతో బతుకు బండిని లాగేందుకు అవసరమైన ఖర్చుల కోసం వేతన జీవులు బ్యాంకులు, ఏటీఎంలను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది.

నెల మొదటివారం వచ్చిందంటే బ్యాంకుల్లో ఉద్యోగుల హడావిడి
సాధారణంగా నెల మొదటివారం వచ్చిందంటే బ్యాంకుల్లో ఉద్యోగుల హడావిడి కనిపిస్తుంది. ఇక మోదీ నోట్ల రద్దు నేపథ్యంలో..దేశవ్యాప్తంగా మరోసారి ఆర్థిక అత్యవసర పరిస్థితులు కనిపించే అవకాశం లేకపోలేదు. ఉద్యోగుల రద్దీని తట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం, ఆర్బీఐ, బ్యాంకు అధికారులు చెబుతున్నప్పటికీ... వాస్తవ పరిస్థితి మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది.

డిసెంబరు 1 నుంచి 10వ తేదీ వరకు విధులు నిర్వర్తించడం కత్తిమీద సామే
ఈ వారం అంతా నగదు కోసం వచ్చేవారి రద్దీని తట్టుకోవడం సాధ్యమయ్యే పని కాదని గణాంకాల విశ్లేషణ చూస్తే అర్ధం అవుతోంది. ఇప్పటికే సరపడా నగదు లేక అసహనంతో ఉన్న ప్రజలు బ్యాంకు సిబ్బందిని దూషిస్తున్నారని.. ఇప్పుడు కొత్తగా వేతన జీవుల డిమాండ్‌ కూడా తోడైతే ఎలాంటి సమస్యలు వస్తాయోనని బ్యాంకు ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. డిసెంబరు 1 నుంచి 10వ తేదీ వరకు ప్రజలందరినీ సంతృప్తి పరచడం అనేది కత్తిమీద సాములాంటిదేనని క్షేత్రస్థాయిలో పని చేసే బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

రూ. 500, 1000 నోట్ల రద్దుతో నగదు కొరత
మోదీ సర్కారు 500, 1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయంతో వ్యవస్థలో నగదు లభ్యత కొరత ఏర్పడి ప్రజలకు చిల్లర కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వ ఆంక్షలు, రద్దీ నేపథ్యంలోనూ నవంబరు 10 నుంచి బ్యాంకుల ద్వారా రోజు సగటున 12,742 కోట్ల రూపాయల నగదు వితరణలు జరుగుతున్నాయి. ప్రతి నెలా మొదటి వారంలో నగదుకు సాధారణం కంటే కూడా 5-8 శాతం అధిక డిమాండ్‌ ఉంటోంది. ఈ లెక్కన డిసెంబరు ఒకటి నుంచి మొదలయ్యే వారంలో దాదాపు లక్ష కోట్ల నగదుకు డిమాండ్‌ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కరెన్సీ కొరతను ఎదుర్కొంటున్న బ్యాంకులకు ఈ పరిస్థితులను ఎదుర్కొవడం అంత సులభం కాదని బ్యాంకింగ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కేవలం రూ. 2000 నోట్లు వస్తుండటంతో ప్రజలకు తప్పని తిప్పలు
కరెన్సీ కష్టాలు రాకుండా సర్కారు అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాల్లోని బ్యాంకులకు రోజూవారిగా అందాల్సిన నగదులో కేవలం 10 నుంచి 50 శాతం కరెన్సీ మాత్రమే సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉన్న నగదునే సర్దేందుకు బ్యాంక్‌ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో బ్యాంక్‌ సిబ్బందిని ప్రజలు దుర్భాషలాడటం కనిపిస్తోంది. చాలా బ్యాంకుల్లో ఇప్పటికే 100 నోట్ల సరఫరా నిలిచిపోయింది. పెద్ద బ్యాంకు నుంచి కేవలం 2000 రూపాయల నోట్లు మాత్రమే వస్తుండటం ప్రజల కష్టాలను మరింతగా పెంచేస్తోంది. ప్రజల లావాదేవీలకు సరిపడా నగదు సరఫరా లేకపోవడమే ప్రజల కష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సరిపడా డబ్బులు లేకపోతే ప్రజలు తమ అసహనాన్ని బ్యాంకు ఉద్యోగుల పట్ల చూపించే ప్రమాదం ఉందని, రానున్న రోజుల్లో బ్యాంకు ఉద్యోగులకు తగిన భద్రత ఏర్పాట్లు కల్పించాలని బ్యాంకు ఉద్యోగులు కోరుతున్నారు.  

Don't Miss