నిత్యావసరాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం

07:37 - December 1, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు ప్రభావం నిత్యవసర వస్తువులు, ఆహార ఉత్పత్తులపై పెద్ద ఎత్తున పడింది. నోట్ల రద్దు తర్వాత ఇప్పటికే 30 శాతం మేర ఆహార ఉత్పత్తుల అమ్మకాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ మార్కెట్లకు.. కూరగాయలు వంటి నిత్యవసరవస్తువులు రావడం తగ్గిపోయింది. దీనివల్ల దాదాపు 45 శాతం ఆదాయానికి గండి పడింది. అంతేనా చాక్లెట్లు, ఐస్‌క్రీం తదితరాల ఉత్పత్తి సంస్థలు సైతం అమ్మకాలు లేక నష్టాల బాటన సాగుతున్నాయి. 
తగ్గిన 45 శాతం ఆదాయం 
ఉప్పు, పప్పు, చింతపండు మొదలు.. సబ్బులు, నూనెలవరకు ఏ ఒక్క నిత్యావసర వస్తువు లేకపోయినా ఇల్లు గడవడం కష్టం. అయితే.. పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ప్రజలు నిత్యవసర వస్తువులను అత్యంత పొదుపుగానే కొంటున్నారు. చిల్లర లోటు దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఫలితంగా నిత్యావసర వస్తువుల అమ్మకాలు తగ్గి... మార్కెట్లు డీలా పడిపోయాయి. నోట్ల రద్దు నేపథ్యంలో చాక్లెట్లు, ఐసీక్రీం వంటి ఆహార ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీల అమ్మకాలు 30 శాతం మేర పడిపోయి కుదేలయ్యాయి. సూపర్‌ మార్కెట్లకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఉత్పత్తులు కూడా ఆగిపోయి.. దాదాపు 45 శాతం ఆదాయం తగ్గింది. 
వెలవెల బోతున్న మార్కెట్లు 
సబ్బులు, టూత్‌పేస్ట్‌లు, బాడీ క్రీమ్‌లు, బాడీ ఆయిల్స్‌, షాంపూల వంటి వస్తువుల అమ్మకాలు తగ్గి... కిరాణ దుకాణ యజమానులు ఆందోళన చెందుతున్నారు.  తినుబండారాల ఉత్పత్తులకు డిమాండ్ ఉన్నప్పటికీ... చాలామంది డబ్బులు లేక వాటిని కొనలేకపోతున్నారు. దీంతో  విక్రయాలు పడిపోయి మార్కెట్లు డీలా పడ్డాయి.  గ్రామీణ ప్రాంతాల ప్రజలు అధికంగా నగదు లావాదేవీలపైనే ఆధారపడతారు. వారిలో అత్యధికులకు ఆన్‌లైన్‌, నగదు రహిత లావాదేవీలంటే ఏంటో కూడా తెలియవు. ఇలాంటి పరిస్థితుల్లో కొనేందుకు గ్రామీణుల వద్ద నగదు లేక.. ఆహార సంబంధిత మార్కెట్లు క్రయవిక్రయాలు లేక వెలవెల బోతున్నాయి. 
కళ తప్పిన బంగారం మార్కెట్‌  
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో అటు బంగారం మార్కెట్‌ కళ తప్పింది. నగదు కొరతతో భారీ ఎత్తున బంగారం అమ్మకాలు పడిపోవడంతో ...నవంబర్‌ తర్వాత క్రమంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ముంబైలోని జవేరీ బజార్‌ ప్రతిరోజు సగటున 125 కోట్ల వ్యాపారంతో తణుకులీనేది. అలాంటిది పెద్ద నోట్ల రద్దు తర్వాత రోజుకు 13 కోట్లకు పడిపోయింది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు అత్యవసరమైతే తప్పా... ఎవరూ బంగారం కొనుగోళ్లు చేయడం లేదు.  నగదు అందుబాటులో లేక చాలా మంది వివాహాలు, శుభకార్యాలను వాయిదా వేసుకుంటుండటంతో బంగారం  మార్కెట్లు కళ తప్పి.. వ్యాపారులు నష్టాల బారిన పడుతున్నారు. 

 

Don't Miss