కనకంపై క్లారిటీ!!

21:24 - December 1, 2016

ఢిల్లీ : బంగారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పురుషుల వద్ద 100 గ్రాముల బంగారం.. అవివాహిత మహిళల వద్ద 250 గ్రాముల బంగారం, వివాహిత మహిళల వద్ద 500 గ్రాముల బంగారం కంటే ఎక్కువ ఉండరాదని తేల్చి చెప్పింది. ఇంతకంటే ఎక్కువ ఉంటే టాక్స్‌ తప్పదు. వారసత్వంగా వచ్చిన బంగారానికి అలాగే.. లెక్కచూపిన ఆదాయంతో కొనుగోలు చేసిన బంగారంపై పన్ను ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఇవి కొత్తగా తీసుకొచ్చిన మార్గదర్శకాలు కాదని గతంలో కూడా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు.

సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం
బంగారం అంటే ఎవరికి మోజుండదు. మహిళలు.. పురుషులు అనే తేడానే ఉండదు.. కొందరైతే నఖ శిఖ పర్యంతం బంగారం ధరించేందుకు ఇష్టపడుతారు. 600 గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సి ఉంటుందని... లేదంటే మీ బంగారం సంగతి అంతే... అంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. బ్యాంక్‌ లాకర్‌లను సైతం తెరుస్తారని దాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుంటారనే వార్తలూ వచ్చాయి. దీంతో మహిళలు బంగారంపై బెంగ పెట్టుకున్నారు. తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బంగారంపై స్పష్టత ఇచ్చారు.

అవివాహిత మహిళల వద్ద 250 గ్రాముల బంగారం ఉండొచ్చు
తాళిబొట్టుపై ట్యాక్స్‌ మినహాయింపు ఇచ్చిన కేంద్రం.. పురుషుల వద్ద 100 గ్రాముల బంగారం.. అవివాహిత మహిళల వద్ద 250 గ్రాముల బంగారం, వివాహిత మహిళల వద్ద 500 గ్రాముల బంగారం కంటే ఎక్కువ ఉండరాదని తేల్చి చెప్పింది. వారసత్వంగా వచ్చిన బంగారానికి అలాగే.. లెక్కచూపిన ఆదాయంతో కొనుగోలు చేసిన బంగారంపై పన్ను ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఇవి కొత్తగా తీసుకొచ్చిన మార్గదర్శకాలు కాదని గతంలో కూడా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. నగదు మార్పిడిలో భాగంగా కొనుగోలు చేసిన బంగారంపై మాత్రమే పన్ను విధిస్తామని జైట్లీ స్పష్టం చేశారు.

సంపన్న వర్గాలను ఆందోళనకు గురిచేయనుందా?
మరోవైపు కేంద్ర నిర్ణయంపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. గోల్డ్‌ మాఫియా చేసే పనిని దేశ ప్రజలంతా చేసేలా కేంద్రం చర్యలు చేపట్టిందని అంటున్నారు. మొత్తానికి బంగారంపై కేంద్రం ఇచ్చిన క్లారిటీ పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడకున్నా.. సంపన్న వర్గాలను ఆందోళనకు గురిచేస్తుందనడంలో సందేహం లేదు.

Don't Miss