నరకానికి దారులు...

13:53 - December 4, 2016

నిజామాబాద్ : సంవత్సరాలు గడుస్తున్నా.. పూర్తికాని పనులు.. ఇరుకు రహదారుల్లో వాహనదారులు అవస్థలు. రాత్రయిందంటే.. రోడ్డుపై ప్రయాణం నరకంగా మారింది. నిజామాబాద్‌- హైదరాబాద్‌ ప్రధాన రహదారి దుస్థతిపై టెన్‌టీవీ  ప్రత్యేక కథనం..
అధ్వాన్నంగా రోడ్లు 
నిజామాబాద్‌ జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఏళ్లతరబడి కొనసాగుతున్న  రోడ్లు, కల్వర్టుల నిర్మాణం.. ప్రయాణానికి తీవ్ర ఆటంకాలు కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌ -నిజామాబాద్‌ రహదారిపై ప్రయాణం అంటేనే వాహనదారులను హడలిపోతున్నారు. రోడ్లు వెడల్పు పేరుతో ఉన్న బ్రిడ్జిలను కూల్చేసిన అధికారులు.. కొత్తబ్రిడ్జిల నిర్మాణాన్ని కాంట్రాక్టర్‌ దయకు వదిలేశారు. ప్రధానంగా నిజామాబాద్‌ -హైదరాబాద్‌ రోడ్డుపై ఎంతకీ పూర్తికాని బ్రిడ్జిల నిర్మాణం.. ప్రజలను విసుగెత్తిస్తోంది. 
నాసిరకంగా బ్రిడ్జీ పనులు 
నిజామాబాద్‌ పట్టణాన్ని వివిధ ప్రాంతాలలో కలిపే రోడ్లు 7 ఉండగా వాటిలో రద్దీ ఎక్కువగా ఉండేది హైదరాబాద్‌ నిజామాబాద్‌ రోడ్డు. దీన్ని 4లైన్లరహదారిగా మారుస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి డిచ్‌పల్లి వరకు నాలుగులైన్ల రోడ్డు ఉండగా.. డిచ్‌పల్లి నుంచి నిజామాబాద్‌ వరకు 14కిలోమీటర్ల రోడ్డును 4లైన్లుగా మార్చే పనులు జరుగుతున్నాయి. దాన్లో భాగంగా కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణాన్ని చేపట్టారు. నిజామాబాద్‌ పట్టణ శివారు ప్రాంతమైన బొర్గాం వద్ద బ్రిడ్జి నిర్మాణం నత్తనడకను తలపిస్తోంది. అసలే ఇరుకు రోడ్డు.. పైగా సగం బ్రిడ్జిని కూల్చేసి కొత్తగా నిర్మాణం చేపట్టారు. చేస్తున్న అరకొర పనులు కూడా నాసిరకంగా కానిచ్చేస్తున్నారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
అర్థాంతరంగా ఆగిపోయిన బ్రిడ్జిపనులు 
ఇక.. దర్నారం  దగ్గర బ్రిడ్జిపనులు కోర్టు కేసులతో అర్థాంతరంగా ఆగిపోయాయి. రోడ్డు వెడల్పుకోసం భూసేకరణ చేయాల్సి ఉండగా.. అవేవి పట్టించుకోకుండా... ముందుగా కల్వర్టుల నిర్మాణం చేపట్టడంతో.. కోర్టుకేసులు అడ్డంకిగా మారాయి. దీంతో  రోడ్డు నిర్మాణం.. ఎప్పటికి పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితివచ్చింది. పాత బ్రిడ్జిపై భారీ వాహనాలు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ఎప్పుడు బ్రిడ్జి కూలి ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్‌ ప్రజలు కోరుతున్నారు. 

 

Don't Miss