భాగ్యనగరంలో 'నిపా'కలకలం?!!..

16:33 - May 25, 2018

హైదరాబాద్ :    కేరళ రాష్ట్రాన్ని వణికిస్తున్న నిపా వైరస్.. ఇపుడు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా విస్తరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో ఇద్దరిలో నిపా వైరస్ లక్షణాలను గుర్తించారు. అలాగే, మహారాష్ట్ర, గోవాలలో ఈ వైరస్ వ్యాపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఈక్రమంలో కేరళ నుండి నిపా వైరస్ హైదరాబాద్ కు చేరుకున్నట్లుగా సమాచారం.

మలేషియాలో 'నిపా'వైరస్ మూలాలు..
ప్రాణాంతకమైన వైరస్ వ్యాధి. గబ్బిలాలు, పందులు, మనుషులలో ఎవరి నుంచి ఎవరికైనా ఈ వైరస్‌ సోకుతుంది. 1998లో మలేషియాలో మొదటిసారిగా వైరస్‌ కనుగొనబడింది, అటుతర్వాత 2004లో బంగ్లాదేశ్ లోకి వచ్చింది, ప్రస్తుతం ఈ వైరస్‌ కేరళలోకి ప్రవేశించింది.

సుంగాయ్ నిపా గ్రామంలో పుట్టి అదేపేరుతో ప్రాచుర్యం..
మలేసియాలోని సుంగాయ్ నిపా అనే గ్రామంలోని రోగుల నుంచి తొలిసారిగా ఈ వైరస్ ను కనుగొన్నారు కాబట్టి, దీనిని నిపా వైరస్‌ గా నామకరణం చేశారు. ఈ వ్యాధితో మలేషియా 105 మంది మృతి చెందగా, సింగపూర్‌లో పందులను పెంచే పశుపోషకులు మృతి చెందారు.

కేరళలో నిపా ముప్పేట దాడి..
నిపా వైర్‌స కేరళపై ముప్పేట దాడి చేస్తోంది. అంతుచిక్కని ఈ వైరస్‌ బారిన పడి కేరళలో ఇప్పటికే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. ఇదే కుటుంబంలోని మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులందరికీ ఐసీయూల్లో చికిత్సలు అందిస్తున్నారు. నిపా వైరస్‌ దక్షిణ భారత దేశంలో కనిపించడం ఇదే తొలిసారి. దీంతో ఈ ప్రాణాంతక వైరస్‌ పట్ల కేరళతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కేరళలోని కోజికోడ్‌ తదితర ప్రాంతాల్లో 23 మంది నిపా వైరస్‌ బాధితులు వివిధ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. కొద్దిరోజుల కిందట వీరంతా జ్వరం, తలనొప్పి, శ్వాస సంబంధమైన సమస్యలతో ఆస్పత్రులకు వచ్చారు. కొందరిలో మెదడువాపు లక్షణాలు కనిపించాయి. వ్యాధి లక్షణాలు వైద్యులకు అంతుపట్టకపోవంతో రోగుల నుంచి రక్తనమూనాలు సేకరించి వ్యాధినిర్ధారణ కోసం పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపారు. అక్కడ జరిపిన పరీక్షల్లో నిపా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారించారు.

నిపా వైరస్‌ లక్షణాలు..
నిపా వైరస్‌ తో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుందని, ప్రధానంగా గబ్బిలాల్లో, వాటిలో ప్రధానంగా పండ్లుతినే గబ్బిలాల్లో అంటే ఫ్రూట్‌బ్యాట్స్‌లో వైరస్‌ ఎక్కువగా ఉంటుందని, అందుకే వీటిని ఎగిరే నక్కలని అని అంటారన్నారు. ఈ వైరస్‌ బారిన పడితే వణుకుతో కూడిన జ్వరం, వాంతులు, వికారం, తలనొప్పి, ఫిట్స్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. ముఖ్యంగా గబ్బిలాలు కొరికిన పండ్లు తినడం వలన వైరస్‌ వస్తుందని, రెండోది ఈ పండ్లుతిన్న పందుల ద్వారా కూడా వస్తుందన్నారు. ప్రజలు ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణమే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్యం పొందాలన్నారు.

కేరళ టూ హైదరాబాద్ కు నిపా?!..
ఇటీవల కేరళకు వెళ్లి వచ్చిన ఓ హైదరాబాదీకి, మరో వ్యక్తికి ప్రాణాంతక నిపా వైరస్ సోకినట్టు డాక్టర్లు అనుమానిస్తున్నారు. వీరి రక్త నమూనాలను నిపా వైరస్ నిర్ధారణ కోసం పుణెలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించినట్టు తెలంగాణ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కే రమేష్‌ రెడ్డి కొద్దిసేపటి క్రితం వెల్లడించారు.

నిపా రోగులకు చికిత్సందిస్తున్న ఎన్సీడీసీ..
తాము ఇప్పటికే కేరళలో నిపా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న ఎన్సీడీసీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అధికారులతో చర్చించామని తెలిపారు. నిపా వైరస్ సోకినట్టు అనుమానిస్తున్న వ్యక్తి కేరళకు వెళ్లి వచ్చాడని, అయితే, వైరస్ ఉన్న ప్రాంతానికి ఆయన చాలా దూరంలోనే ఉన్నారని, వ్యాధి నిర్ధారణకే రక్త నమూనాలు తీసుకున్నామని, పాజిటివ్ గా తేలే అవకాశం తక్కువేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. హాస్పిటల్స్ లో డాక్టర్ల కోసం ప్రొటెక్టివ్ సూట్లను సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడితే, ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఈ వైరస్ పై అవగాహన పెంచేందుకు ఎన్జీవో సంస్థలు ప్రచారం చేయాలని సూచించారు. చెట్ల నుంచి రాలిపడిన, పక్షులు కొరికిన పండ్లను తినకుండా ఉండాలని కోరారు. కాగా, నిపా బారినపడి ఇప్పటివరకూ 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. నిపా వైరస్ హైదరాబాద్ కు వచ్చిందని సోషల్ మీడియాల్లో ప్రచారం ప్రారంభం కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


 

Don't Miss