పాలమూరులో అక్రమ నిర్మాణాలు..

17:55 - December 7, 2016

మహబూబ్‌నగర్‌ : పాలమూరులో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అక్రమ లేఅవుట్లు ఎక్కువ అవుతున్నాయి. రోడ్లు, నాలాలను అక్రమించుకుని చాలా కాలంగా యథేచ్ఛగా నిర్మాణాలు సాగిస్తున్నారు. దీంతో రోడ్లు కుచించుకుపోతున్నాయి. ఒక కారు వెళుతుంటే ఎదురుగా వస్తే మోటారు బైక్‌ అగిపోవాల్సిన దుస్థితి దాపురుంచింది. ఆక్రమణలకు గురైన నాలాలతో వర్షాకాలం వస్తే నీరంతా రోడ్లపైనే. ఈ పరిస్థితికి ముగింపు పలకాలనుకున్న మున్సిపల్‌ అధికారులు అక్రమ కట్టడాల కూల్చివేతలు ప్రారంభించారు.
మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీలో పది కాదు, ఇరవై కాదు... వందల సంఖ్యలో అక్రమ కట్టడాలు ఉన్నాయి. వీటిలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఇళ్లు కూడా ఈ జాబితాలో చేరాయి.

570 అక్రమ నిర్మాణాలు..
స్థలాన్ని బట్టి రెండు అంతస్తులకు అనుమతి ఇస్తే నాలుగైదు అంతస్తుల్లో భవనాలు వెలిశాయి. పట్టణంలో మొత్తం 570 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు మున్సిపల్‌ అధికారులు తేల్చారు. ఇప్పుడు వీటన్నింటిని పోలీసుల బందోబస్తు మధ్య కూల్చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇవి ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. అక్రమ లే అవుట్లు వెలుస్తున్న ప్రాంతాల్లోనే అక్రమ కట్టడాలు కూడా ఎక్కువగా వెలుస్తున్నాయి.  మరోవైపు కట్టడాల కూల్చివేతలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కట్టడాలైతే పునాదులు, పిల్లర్ల దశలోనే అభ్యంతరం ఎందుకు చెప్పడం లేదని అడుగుతున్నారు. నిర్మాణం పూర్తయ్యే వరకు ఎందుకు మిన్నకుండిపోతున్నారని నిలదీస్తున్నారు. ముందుగానే నోటీసులు ఇచ్చి పనులు ఎందుకు ఆపివేయించడంలేదని ప్రశ్నిస్తున్నారు. అధికారుల అవినీతే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు. ఇందుకు కారణమైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Don't Miss