వేడిపుట్టిస్తున్న ముద్రగడ పాదయాత్ర ప్రకటన

08:20 - December 4, 2016

విజయవాడ : కాపునేత తముద్రగడ పద్మనాభం పాదయాత్ర మరోసారి వేడి పుట్టిస్తోంది. ఈ యాత్రకు అనుమతిచ్చేది లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తుంటే... జేఏసీ మాత్రం అనుకున్నది చేసి తీరతామని కుండబద్దలు కొడుతోంది. ఉభయ వర్గాలూ పంతానికి పోతుండడం..రాష్ట్ర రాజకీయాల్లో కాకను పెంచుతోంది. 
రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోన్న ముద్రగడ నిర్ణయం  
జనవరి నెలలో పాదయాత్ర చేపట్టాలన్న కాపు జేఏసీ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. రావులపాలెంనుంచి అంతర్వేది వరకు.. పాదయాత్ర చేపట్టేందుకు కాపు జేఏసీ ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. దీనికి అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. ఇది కాపు సామాజిక వర్గంలో మరింత ఆగ్రహాన్ని రగిలిస్తోంది. తమ పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇవ్వరని ముద్రగడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.. సర్కారు ఒప్పుకోకపోయినా ఈసారి యాత్ర ఆపే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. 
శాంతిభద్రతలకు ముద్రగడ విఘాతం కలిగించే ప్రయత్నం : చినరాజప్ప 
కాపు జేఏసీ తలపెట్టిన పాదయాత్రను ప్రభుత్వ పెద్దలు తప్పుబడుతున్నారు. ముద్రగడ పద్మనాభం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని.. సాక్షాత్తు హోంమంత్రి, కాపు సామాజికవర్గపు నేత చినరాజప్ప ఆరోపిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలను ప్రభుత్వం అనుమతించబోదని హోంమంత్రి స్పష్టం చేశారు. 
రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను తగులబెట్టడంతో ఉద్రిక్తత
ఎన్నికల వేళ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలంటూ ముద్రగడ పద్మనాభం.. ఏడాది కాలంగా పలు రకాల నిరసనల ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తుని సభకు వచ్చిన ఆందోళనకారులు రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఆందోళనకారులు తగులబెట్టడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చింది. ఈకేసులో నిందితుల అరెస్టులూ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దాసరి నారాయణరావు లాంటి కాపు పెద్దలతో ముద్రగడ పద్మనాభం సమావేశమై మద్దతును కూడగట్టారు. అటు వైసీపీ అధినేత జగన్‌ కూడా ఇప్పటికే కాపు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. దీంతో ప్రభుత్వంపై అన్ని రకాలుగానూ ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఇటీవల ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు సిద్ధం కాగా.. పోలీసులు ఆయన్ను గృహనిర్బంధంలో ఉంచారు. పోలీసు ఉన్నతాధికారుల రాజీ యత్నాలు ఫలించి ముద్రగడ యాత్రను విరమించుకున్నారు. 
పోలీసు అనుమతి లేకున్నా పాదయాత్ర చేస్తా : ముద్రగడ 
గడచిన ఏడాదికాలంగా ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న తాము.... జనవరిలో పోలీసు అనుమతి లేకున్నా పాదయాత్ర చేసి తీరతామంటూ.. కాపు నాయకులు ముఖ్యంగా ముద్రగడ సమాయత్తమవుతున్నారు. పాదయాత్రతో పాటు.. రెండు నెలల కార్యాచరణనూ రూపొందించుకున్నారు. కంచాలు వాయించడం... ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వడం, కొవ్వొత్తుల ప్రదర్శన తదితర రూపాల్లో తమ ఆకాంక్షను వ్యక్తీకరించాలని భావిస్తోంది. పైగా తుని ఘటనకు కారకులెవరో చెబుతానంటూ ముద్రగడ చేసిన ప్రకటనా ఆసక్తిని రేపుతోంది. ముద్రగడ తాజా వ్యాఖ్యలు రైలుదహనం కేసులో కొత్త కోణాన్ని ఆవిష్కరించవచ్చన్న భావన వ్యక్తమవుతోంది. మొత్తానికి కాపు జేఏసీ తాజా పాదయాత్రపై చంద్రబాబు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

 

Don't Miss