టీఆర్‌ఎస్‌లో ఎక్కువ టికెట్లు వారికే దక్కాయి..

08:14 - September 9, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్.. 105 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఇద్దరికి తప్ప...అందరికీ మళ్లీ అవకాశం కల్పించారు. బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న తెలంగాణలో....ఆ వర్గాలకు ఎన్ని సీట్లు కేటాయించారు. జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించారా ? లేదంటే గెలుపు గుర్రాలకే మళ్లీ అవకాశం ఇచ్చారా ? 
9శాతం జనాభా ఉన్న కులాలకు 55 సీట్లు..
దేశంలోనే ఎక్కువ బలహీన వర్గాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ. అసెంబ్లీని అర్ధాంతరంగా రద్దు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. అంతేకాదు, ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైన కేసీఆర్‌.. 119 స్థానాల్లో 105 స్థానాలకూ అభ్యర్థులనూ ప్రకటించేశారు. అయితే.. తెలంగాణ అసెంబ్లీలో...బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించారన్న దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీని రద్దు చేసిన 105 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.... సిట్టింగ్ అభ్యర్థులకు మళ్లీ అవకాశం కల్పించారు. నిన్న మొన్నటి వరకు సామాజిక న్యాయం అంటూ మాట్లాడిన కేసీఆర్...సీట్ల కేటాయింపులో బలహీన వర్గాలకు అన్యాయం చేశారన్న విమర్శలు ఆ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల్లో 9శాతం జనాభా ఉన్న కులాలకు 55 సీట్లు దక్కితే...91శాతం ఉన్న బలహీన వర్గాలకు దక్కింది 50 సీట్లు. 
52శాతం బీసీలకు 20 సీట్లే.. 
తెలంగాణలో 52శాతం బీసీల జనాభా  ఉంటే...వారికి దక్కింది మాత్రం 20 సీట్లే. ఎస్సీలకు 16, ఎస్టీలకు 12 సీట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీలకు జనరల్ కేటగిరి సీట్లు కేటాయించకూడదా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు బలహీనవర్గాల ప్రజలు. మున్నూరుకాపులు, గౌడ సామాజిక వర్గాలకు చెరో ఆరు సీట్లు దక్కాయ్. యాదవులకు 4 సీట్లు, ముదిరాజ్‌, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, పెరిక కులాలకు ఒక్కో చోట ప్రాతినిధ్యం కల్పించారు. 16 ఎస్సీ రిజర్వుడ్‌ స్థానాల్లో 8 మాదిగ. మరో ఏడు చోట్ల మాల, ఒక స్థానం నేతకాని వర్గానికి కేటాయించడం ద్వారా సమతూకం పాటించారు. ఎస్టీలకు 12 స్థానాలుంటే...ఏడుగురు లంబాడ, ఐదుగురు ఆదివాసీ అభ్యర్థులను ఎంపిక చేశారు. రెండు సీట్లు ముస్లిం మైనారిటీలకు కేటాయించారు. 
ఎక్కువభాగం రెడ్లకే  
టీఆర్‌ఎస్‌ టికెట్లలో ఎక్కువభాగం రెడ్లకే దక్కాయి. 6శాతం జనాభా ఉన్న రెడ్లకు 35 సీట్లు,  0.5శాతం ఉన్న వెలమలకు 10, ఒక శాతం లోపున్న కమ్మ సామాజిక వర్గానికి 6 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు కేసీఆర్. హైదరాబాద్‌లో స్థిరపడ్డ రాజపుత్ర వంశానికి ఒక సీటిచ్చారు. అభ్యర్థులు ప్రకటించని 14 టికెట్లు ఎవరికి కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 
సకల జనుల సర్వే.. 91శాతం బలహీన వర్గాలు 
సకల జనుల సర్వే చేయించిన కేసీఆర్....రాష్ట్రంలో 91శాతం బలహీన వర్గాల జనాభా ఉన్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ తర్వాత జనాభాకు అనుగుణంగా ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. సామాజిక న్యాయం జరగాలంటే రిజర్వేషన్ల పెంచుకునే అధికారం రాష్ట్రాలకే ఉండాలని కొత్త వాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే చేతిలో ఉన్న అధికారంతో ఎంత వరకు సామాజిక న్యాయం చేస్తున్నారో ఆలోచించుకోవాలని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 

 

Don't Miss