వరవరరావు అరెస్టు...వివరాలు...

06:32 - August 29, 2018

హైదరాబాద్ : ప్రధాని మోదీ హత్య కుట్ర కేసులో అరెస్ట్‌ చేసిన విరసం నేత వరవరరావును.. పోలీసులు ఈరోజు పుణె కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిన్న ఉదయం హైదరాబాద్‌లోని వరవరరావు నివాసంలో సోదాలు నిర్వహించి... అనంతరం అరెస్ట్‌ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు సూచనల మేరకు పుణె తరలించారు. ప్రధాని మోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు చేసిన కుట్రలో వరవరరావు పేరు ఉన్నట్లు గతంలో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మావోయిస్టులు రాసిన లేఖలో వరవరరావు పేరు ఉన్నట్లు గుర్తించిన పుణె పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌లోని వరవరరావు నివాసంలో సోదాలు చేసిన పోలీసుల.. ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, సాహిత్య పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుంటే తమను ఏడు గంటల పాటు నిర్బంధించి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని వరవరరావు సతీమణి హేమలత ఆరోపించారు. కనీసం మంచినీళ్లు, టీ కూడా తాగేందుకు అనుమతివ్వలేదన్నారు. ఇక వరవరరావుపై పోలీసులు ఉపా చట్టం కింద కేసులు నమోదు చేశారు. దేశంలో ఐదుగురిపై మాత్రమే ఈ యాక్ట్‌ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ యాక్ట్‌లో ఉన్న సెక్షన్‌ 15, 16, 17 కింద కేసు నిరూపితమైతే టెర్రరిస్ట్‌గా భావించి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపులంటున్నారు. 

వరవరరావు అరెస్టును ప్రజాసంఘాలు, సీపీఎం పార్టీ నేతలు ఖండించారు. వరవరరావుపై కుట్రపూరిత కేసును ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. వరవరరావుపై తప్పుడు అభియోగాలు మోపి భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వరవరరావు గొంతు నొక్కడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.  మూడు నెలల కింద దొరికిన లేఖను ఇప్పుడు ప్రస్తావించి పోలీసులు అరెస్ట్‌ చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

Don't Miss