తెలంగాణలో విద్యారంగ ప్రక్షాళన

08:13 - December 1, 2016

హైదరాబాద్ : తెలంగాణలో విద్యారంగ ప్రక్షాళనకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో విద్యాప్రమాణాలు పెంచేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ మొదలుకుని ఉన్నత విద్య వరకు అన్ని విభాగాలతో విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి సమీక్షలు ప్రారంభించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎంసెట్ రద్దకు సమాలోచనలు చేస్తున్నట్లు కడియం తెలిపారు. 
మంత్రి కడియం శ్రీహరి వర్క్‌షాప్ 
తెలంగాణాలో విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర విద్యాశాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే విద్యాప్రమాణాలు పెంచేందుకు విడతల వారిగా సమీక్షలు ప్రారంభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని సర్వశిక్షా అభియాన్‌లో డీఈఓలు, ఆర్‌జేడీలతో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పెంచి ప్రమాణాలు పెంచేందుకు డీఈఓలు అప్రమత్తంగా ఉండాలని, అందుకు అనుగుణంగా శ్రమించాలని సూచించారు. ఆయా జిల్లాల్లో ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే చర్యలు చేపట్టేందుకు విద్యాశాఖ సిద్ధంగా ఉందని అధికారులకు తెలిపారు. 
వచ్చే ఏడాది నుంచి ఎంసెట్ రద్దు..? 
మరోవైపు ఈ సమీక్షా సమావేశం... అనంతరం మీడియాతో కడియం తన మనోగతాలను పంచుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఎంసెట్ రద్దుకు సంబంధించి సమాలోచనలు చేస్తున్నట్లు.. అధిక ఫీజులు వసూలు చేస్తున్న 162 ప్రైవేటు స్కూల్స్ కు నోటీసులు జారీ చేసి చర్యలకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్ధులకు ఉద్యోగాలు ఇవ్వడం కష్టమేనని స్పష్టంచేశారు. మొత్తంగా స్కూల్స్ నుంచి హయ్యర్‌ ఎడ్యుకేషన్ వరకు అన్నింటిలో తాము సంస్కరణలు చేస్తున్నామని అందుకు అధికారులనూ సిద్ధం చేస్తున్నట్లు కడియం పేర్కొన్నారు. 

 

Don't Miss