హైదరాబాద్ నగర ప్రణాళికలు

09:50 - December 2, 2016

హైదరాబాద్ : నగరంలోని సమస్యల పరిష్కారానికి నగర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు 12 గంటలపాటు జరిగిన సమావేశంలో నగర మౌలిక సమస్యలపై కూలంకశంగా చర్చించారు. నగరంలో నాలాల విస్తరణ, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, శివారు ప్రాంతాలకు త్రాగునీటి సరఫరా వంటి అంశాలతోపాటు పలు కీలక అంశాలపై మంత్రి కేటీఆర్‌ చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం 
గతేడాది స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ సందర్భంగా ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. చాలా రోజుల తరువాత తాజాగా మున్సిపల్‌శాఖా మంత్రి కేటీఆర్ నగర ప్రజా ప్రతినిధులు, అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్నిపార్టీల నేతలు హజరయ్యారు. 
12 గంటల పాటు సుధీర్ఘంగా సమావేశం 
దాదాపు 12గంటల పాటు సుధీర్ఘంగా జరిగిన ఈ సమవేశంలో పలు కీలకనిర్ణయాలు ప్రకటించారు మంత్రి కేటీఆర్. ఇటీవల నగరంలో భారీ వర్షాల కారణంగా తలెత్తిన ఇబ్బందుల నేపథ్యంలో నాళాల అక్రమణల నిర్మాణ గుర్తింపు సర్వే వేగంగా జరుగుతుందన్నారు. మొత్తం 390 కిలో మీటర్ల నాళాల్లో 216 కిలో మీటర్ల నాళాలపై ఉన్న 8,239 అక్రమ నిర్మా ణాలను గుర్తించామన్నారు. ప్రజలకు తక్కువ నష్టం ఉండే రీతిలో నాళాల పునరుద్ధరణ చేస్తామన్నారు మంత్రి కేటీఆర్‌. ఇక నాలాల్లో పేరుకుపోతున్న పూడికతీతను శాస్త్రీయపద్దతిలో తియ్యడానికి ఏడాదంతా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. అవినీతి లేకుండా ఉండేలా చర్యలుతీసుకోవడంతోపాటు.,ఎక్కువ మంది కాంట్రాక్టర్లకు అవకాశం వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 
15వేల ఇళ్ల నిర్మాణాలకు త్వరలో టెండర్లు 
ఇక నగరంలో రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తామన్నారు ఇప్పటికే కొన్ని ఇళ్లకు టెండర్లు పూర్తి అయ్యాయని త్వరలో మరో 15వేల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వనిస్తామన్నారు. ఇప్పటికే సగం నిర్మించబడి ఉన్న ఇందిరమ్మ, జెఎన్ ఎన్ యూఆర్ ఎం పథకంలోని దాదాపు 30వేల ఇళ్లు సిద్దంగా ఉన్నాయని వాటిని పూర్తి చేసి పేదలకు అందుభాటులోకి తెస్తామన్నారు. ఇందుకోసం అవసరం అయిన 300కోట్లరూపాయలను ప్రభుత్వం సమకూరుస్తుందన్నరు. వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండేలా శివారు ప్రాంతాల్లో 1900కోట్లతో 2700కిలో మీటర్లమేర పైపులైన్ పనులు చేపడుతున్నామని, నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వేగంగాపనులు పూర్తి అయ్యేలా ప్లాన్ రూపొందించామన్నారు మంత్రి కేటిఆర్. వివిధ విభాగాలు చేస్తున్న పనులను సిటిజన్స్ కు తెలియజేసేలా పనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రదర్శించాలని అధికారులను ఆదేశించామన్నారు.
పోస్టర్లు, బ్యానర్లు, ప్లెక్సీలు, వాల్ రైటింగ్‌లపై కఠిన చర్యలు 
నగర అందాలను పెంచేలా సిటీలో విచ్చలవిడిగా పోస్టర్లు, బ్యానర్లు, ప్లెక్సీలు, వాల్ రైటింగ్ లేకుండా చూస్తామన్నారు మంత్రి కేటీఆర్‌. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ముందుగా అధికార పార్టీ నేతలపైనే కేసులు నమోదు చెయ్యాలని..ఆ తరువాతే ఇతరులపై చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో త్వరలో 900వరకు టాయిలేట్స్ పెంచుతామన్నా మంత్రి,.పారిశుద్ధ్యం విషయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై ఫైన్‌ వేసేందుకు అధికారులకు మెజిస్ట్రీయల్ పవర్స్ ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. ఇక జిల్లాల అభివృద్ధిపై చర్చించడానికి గతంలో ఉన్న జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం మాదిరిగానే ప్రతి మూడు నెలలకొకసారి ఈ సమావేశాలు నిర్వహించాలని కోరారు బీజేపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. నగర సమస్యలపై సమావేశంలో అర్థవంతమైన చర్చ జరిగిందన్న ఆయన,..గతంలో చేసిన నిర్ణయాల అమలుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సమక్షంలో జరిగిన నిర్ణయాలు ఇప్పటికి అమలు కావడంలేదన్నారు. 
మరో 100 ప్రాంతాల్లో రూ.5 భోజన పథకం 
ఇక హైదరాబాద్‌ నగరంలో అతి తక్కువ ధరకే పేదలకు భోజనం అందించేలా మరో 100 ప్రాంతాల్లో 5రూపాయల భోజనపథకాన్ని అమలు చెయ్యాలని నిర్ణయించింది సమావేశం.

 

Don't Miss