ఆసుపత్రి కల్యాణ వేదిక..

21:26 - December 4, 2016

హైదరాబాద్ : ఆసుపత్రి కల్యాణ వేదికైంది... వైద్యులు కన్యాదాతలయ్యారు.. హస్పిటల్‌ సిబ్బంది బంధువులై ఆశీర్వదించారు. సాక్షాత్తు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి.. ఈ అపురూప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రి ఏంటి.. అందులో పెళ్లి వేడుక ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా..? అయితే మీ అనుమానం తీర్చుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సికిందరాబాద్‌లోని యశోద ఆసుపత్రి కల్యాణోత్సవానికి వేదికైంది. ఇక్కడ జరిగిన సామూహిక వివాహ మహోత్సవం ఆదర్శనీయంగా.. స్పూర్తిదాయకంగా నిలిచింది. యశోద ఆసుపత్రి నిర్వాహకులు.. కొన్నేళ్లుగా యశోద చారిటబుల్‌ ఫౌండేషన్‌ ద్వారా పలు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఈ సామూహిక వివాహ వేడుకను జరిపారు.

2వేల 51 మంది వివాహం..
యశోద చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఇప్పటి వరకు 2వేల 51 మంది అనాథ యువతులకు విద్యాబుద్ధులు చెప్పించి ఉద్యోగాలు ఇప్పించి సమాజంలో సమున్నత స్థానాన్ని కల్పించింది. అంతటితో తమ బాధ్యత తీరిందని ఊరుకోలేదు. ఆ ఆడపడుచులకు మంచి సంబంధాలు వెతికి.. పెళ్లిళ్లూ జరిపిస్తూ వస్తోందీ ఫౌండేషన్‌. ఇదే క్రమంలో ఆదివారం మరో మూడు జంటలకు పెళ్లిళ్లు జరిపించారు యశోద చారిటబుల్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులు. సంస్థ వద్ద ఆశ్రయం పొందిన 2వేల 51మంది.. సంప్రదాయ దుస్తుల్లో ఈ పెళ్లిళ్లకు హాజరై.. కొత్త జంటలకు అభినందనలు, శుభాకాంక్షలు అందజేశారు.
అనాథలను అన్ని విధాలా ఆదుకోవడం చాలా గొప్ప విషయమని సామూహిక వివాహాలకు హాజరైన మంత్రి పోచారం అన్నారు. యువతులకు మంచి సంబంధాలు చూసి ఓ ఇంటివాళ్లను చేసిన యశోద చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఇతర స్వచ్చంద సంస్థలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇన్ని రోజులు తమను చేరదీసి.. విద్యాబుద్ధులు చెప్పించి, ఉద్యోగాలు ఇప్పించడంతో బాధ్యత తీరిందనుకోకుండా.. తమకు వివాహాలు కూడా జరిపించిన యశోద చారిటబుల్‌ ఫౌండేషన్‌కు రుణ పడి ఉంటామని నూతన వధూవరులు అన్నారు. తమకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసి అత్తగారింటికి పంపించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. యశోద చారిటబుల్‌ ఫౌండేషన్‌ చేపట్టిన ఈ సామూహిక వివాహాలపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Don't Miss