చెన్నూరులో డెంగ్యూ జ్వరాలు...

12:22 - August 5, 2018

మంచిర్యాల : జిల్లా చెన్నూరులో డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నాయి. పట్టణంలో జ్వరాలు ప్రబలుతున్నా..పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదు. మురుగు కాల్వల్లో పూడికతీత, క్లోరినేషన్, దోమల నివారణ మందు పిచికారి చేపట్టకపోవడంతో పలు కాలనీల్లో దోమల బెడద అధికమైంది. దీంతో సాయంత్రం అయితే చాలు కిటికీలు, తలుపులు మూసి ఉంచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చెన్నూరు పట్టణంలోని ఇందిరానగర్ లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. మురుగు కాల్వలు లేక పోవడంతో ఇళ్ల మధ్యలో మురుగునీళ్లు నిలిచి ఉంటున్నాయి. దీంతో చిన్నపాటి వర్షం పడితే చాలు కాలనీ ప్రజలు నరకయాతన పడుతున్నారు. మురుగు నీటి మధ్యలోనే బోరుపంపు ఉండడంతో నీళ్లు కలుషితమై వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టణంలోని బట్టిగూడెం, లైన్ గడ్డ, మార్కెట్ రోడ్, తదితర ప్రాంతాల్లో డెంగీ జ్వరాలతో బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. అయితే తెల్ల రక్త కణాలు తగ్గిపోవడంతో బాధితులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. స్థానికంగా చికిత్స పొందినా..జర్వం తగ్గుముఖం పట్టకపోవడంతో పలువురు మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందుతున్నారు.

బట్టిగూడెంలో మురుగుకాల్వలు కంపుకొడుతున్నాయి. అందులో పందులు సైతం సంచరిస్తున్నాయి. దీంతో దోమల బెడద అధికమై పలువురు జ్వరాల బారినపడ్డారు. దీంతో మంచిర్యాలలో నలుగురు డెంగీ బాధితులు కరీంనగర్ లో చికిత్స పొందుతున్నారు. అలాగే లైన్ గడ్డ ప్రాంతంలో కాల్వలు నిండిపోయి మురుగునీళ్లు రోడ్డుపై పారుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో కూడా ఐదుగురు విషజ్వరాలతో ఆస్పత్రి పాలయ్యారు. పట్టణంలో జ్వరాలు ప్రబలడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 

Don't Miss