'నిజామ్ షుగర్స్ ను తెరిపించాలి - తమ్మినేని..

07:47 - December 8, 2016

నిజామాబాద్ : నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ మూతపడి వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని, కార్మికులు, పేదలు రోడ్డు పాలవ్వడమే బంగారు తెలంగాణనా..? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. షుగర్స్‌ ఫ్యాక్టరీని తెరిపించి ప్రభుత్వమే దాన్ని నడిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా... పల్లెపల్లెను చైతన్య పరుస్తూ.. ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర నిజామాబాద్‌ జిల్లాలో కొనసాగుతోంది. 52 వ రోజు గ్రామాల్లో పర్యటించిన పాదయాత్ర బృందం స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంది. కార్మికులు, కర్షకులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ సమస్యలను పాదయాత్ర బృందం దృష్టికి తె‌స్తున్నారు. 52వ రోజు పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో వర్నిలో ప్రారంభమై.. అక్బర్‌నగర్, రాకాసిపేట, బోధన్‌, చక్కర్‌నగర్‌, ఎర్రాజుపల్లి, ఎడపల్లి వరకు కొనసాగింది. సీపీఎం కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసరావు పాదయాత్రలో పాల్గొన్నారు.

అక్రమ లాకౌట్‌ను ఎత్తివేయాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నిజాం సుగర్స్‌ ఫ్యాక్టరీ అక్రమ లాకౌట్‌ను ఎత్తివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ అంశాన్ని చర్చించాలని ఆయన డిమాండ్‌ చేశారు. షుగర్‌ ఫ్యాక్టరీ మూతపడి వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని.. బంగారు తెలంగాణ అంటే... పేదలు, కార్మికులను రోడ్డున పడేయడమేనా అని తమ్మినేని ప్రశ్నించారు. తెలంగాణకు గర్వకారణమైన ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఫ్యాక్టరీని నడపాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యావవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, గురుకుల పాఠశాలల్లో కనీస వసతులు కూడా లేవని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు.

52వ రోజు నాటికి పాదయాత్ర 1330 కిలోమీటర్లు పూర్తి
52వ రోజు నాటికి పాదయాత్ర 1330 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. జోగిని సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. జోగిని వ్యవస్థను రూపుమాపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. 

Don't Miss