సామాజిక తెలంగాణ సాధించేవరకు పోరాటం : తమ్మినేని

09:46 - December 2, 2016

కామారెడ్డి : పేదల సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర కామారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. 46వ రోజు పలు గ్రామాల్లో పర్యటించిన పాదయాత్ర బృందానికి ప్రజలు తమ సమస్యలను వెల్లబోసుకున్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. 
హామీలను నెరవేర్చని కేసీఆర్‌ ప్రభుత్వం : తమ్మినేని 
సామాజిక తెలంగాణ సాధించేవరకు సీపీఎం అలుపెరగని పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చని కేసీఆర్‌ ప్రభుత్వం సామాజిక తెలంగాణ నిర్మిస్తుందన్న నమ్మకం లేదన్నారు. వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలు, కుల సంఘాలు రాజకీయ ప్రత్నామ్నాయ శక్తిగా ఎదగలన్నారు. కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్రలో తెలంగాణ ప్రభుత్వంపై తమ్మినేని ధ్వజమెత్తారు.  
కామారెడ్డి జిల్లాలో తమ్మినేని బృందం పర్యటన 
సీపీఎం మహాజన పాదయాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లాలో తమ్మినేని బృందం పర్యటించింది. పాదయాత్ర బృందానికి స్థానికులు తమ సమస్యల్ని చెప్పుకుంటున్నారు. 46వ రోజు కామారెడ్డి జిల్లా మల్కాపూర్‌లో పాదయాత్ర ప్రారంభమై తుజాల్‌పూర్, బీబీపేట, జనగాం, అంచనూరు, దోమకొండ, లింగుపల్లి, సౌత్‌క్యాంప్‌, జంగంపల్లి, నర్సన్నపల్లి వరకు యాత్ర కొనసాగింది. పాదయాత్రకు పలు సంఘాల నేతలు మద్దతు తెలిపారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. వివిధ సామాజిక సంఘాల నేతలు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.  బీడీ కార్మికుల సమస్యలపై తమ్మినేని సీఎంకు లేఖ రాశారు. బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించి వారిని ఆదుకోవాలని తమ్మినేని లేఖలో పేర్కొన్నారు. 

 

Don't Miss