పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు : తమ్మినేని

12:53 - December 1, 2016

మెదక్ : తెలంగాణ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  విమర్శించారు. మంత్రి హరీష్‌రావుకు పేదల భూములను లాక్కోవడంలో ఉన్న ఆసక్తి.. వారి బతుకులను బాగు చేయడంలో లేదని తమ్మినేని మండిపడ్డారు. పాదయాత్రలో భాగంగా 45వ రోజు  సిద్దిపేట జిల్లా ధర్మారంలో  ఆత్మహత్య చేసుకున్న బాలయ్య కుటుంబాన్ని తమ్మినేని బృందం పరామర్శించింది. 
పెద్దనోట్ల రద్దుతో రైతులు తీవ్ర ఇబ్బందులు : తమ్మినేని
పెద్దనోట్ల రద్దు నిర్ణయం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహాజన పాదయాత్రలో భాగంగా సిద్దిపేట జిల్లా ధర్మారంలో తమ్మినేని బృందం పర్యటించింది. ధర్మారంలో అప్పులపాలై.. భూమి అమ్ముడుపోక ఆత్మహత్య చేసుకున్న బాలయ్య, గాలయ్య కుటుంబాన్ని తమ్మినేని పరామర్శించారు. బాలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రైతులను, పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులుకు గురిచేస్తున్నాయని తమ్మినేని మండిపడ్డారు.  మంత్రి హరీష్‌రావుకు భూములు లాక్కోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల బతుకులపై లేదని తమ్మినేని దుయ్యబట్టారు. 
తమ్మినేని లేఖపై స్పందించని సీఎం కేసీఆర్ : బి.వెంకట్ 
ప్రజా సమస్యలపై 38 లేఖలు రాసినా ఇంతవరకు సీఎం కేసీఆర్‌ స్పందించడం లేదని పాదయాత్ర కోఆర్డినేటర్‌ బి. వెంకట్‌ అన్నారు. కుమార్తెను మంత్రిని చేసేందుకు  కేసీఆర్‌ బీజేపిని మచ్చిక చేసుకునే పనిలో ఉన్నట్టున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 
పాదయాత్ర 1160 కి.మీ పూర్తి 
మహాజన పాదయాత్ర 45వ రోజు సిద్దిపేట జిల్లా దోర్నాల వద్ద ప్రారంభమై.. సాయంత్రం కామారెడ్డి జిల్లాలో ప్రవేశించింది.  ఇప్పటివరకు యాత్ర 1160 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.  పాదయాత్ర బృందానికి అడుగడుగునా.. ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తోంది.  ఇప్పటికే 400 గ్రామాల్లో పర్యటించిన పాదయాత్ర బృందం.. ప్రజల సమస్యలను ఆలకిస్తూ ముందుకు సాగుతోంది. ధర్మారంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబంపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. బాలయ్య కుటుంబం మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తమ్మినేని లేఖలో పేర్కొన్నారు. అవి ప్రభుత్వ హత్యేలే అని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, కరవు సాయంపై తమ్మినేని సీఎంకు మరో లేఖ రాశారు. 

 

Don't Miss