440 గ్రామాల్లో అవి ఎక్కడా కనబడలేద : తమ్మినేని

10:35 - December 7, 2016

కామారెడ్డి : పదండి ముందుకు..పదండి పల్లెకు అంటూ.. మహాజన పాదయాత్ర తెలంగాణలోని పల్లెల్లో పర్యటిస్తోంది. సామాజిక న్యాయమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న పాదయాత్ర 51వ రోజు పూర్తి చేసుకుంది. ప్రతి గ్రామంలో ప్రజలు తమ సమస్యలను పాదయాత్ర బృందానికి విన్నివించుకుంటున్నారు. ఇప్పటివరకు 440 గ్రామాల్లో పర్యటించిన పాదయాత్ర బృందం 1290 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

సర్కార్ పై ధ్వజమెత్తిన తమ్మినేని..
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం.. సీపీఎం పాదయాత్ర కొనసాగిన 440 గ్రామాల్లో ఎక్కడా కనబడలేదని తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజలకు వాగ్ధానాలిచ్చి మోసం చేసిందని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తమ్మినేని ధ్వజమెత్తారు.

అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసిన తమ్మినేని
అంబేద్కర్‌ 60వ వర్ధంతి సందర్భంగా కామారెడ్డిలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి తమ్మినేని నివాళులర్పించారు. అంబేద్కర్‌ సూచించిన పోరాట బాటలోనే కమ్యూనిస్టు పార్టీ ముందుకు వెళుతోందని తమ్మినేని అన్నారు.

అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలి : తమ్మినేని
125 అడుగుల ఎత్తు అంబేద్కర్‌ విగ్రహంతో పాటు ఆయన ఆశయాలను కూడా అంతే ఎత్తులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సీపీఎం కార్మిక సంఘం నాయకుడు... వ్యవసాయ కార్మిక సంఘం నేత నగేష్‌ కోరారు. అనేక గ్రామాల్లో కనీస వసతులు కూడా లేక ప్రజలు, ముఖ్యంగా గిరిజనులు అల్లాడుతున్నారని, ప్రభుత్వం ఆ గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలేదని నగేష్‌ విమర్శించారు. ప్రభుత్వం వెంటనే గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

51వ రోజు పూర్తి చేసుకున్న పాదయాత్ర
సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణలో కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 51వ రోజు పూర్తి చేసుకుంది. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, సోమేశ్వర్‌, దేశాయిపేట, దుర్కి, ఆంకోల్ క్యాంపు, నెమ్లి, రామ్‌శెట్టిపల్లి, బొమ్మన్‌దేవ్‌పల్లి, నస్రుల్లాబాద్, మల్లారం, వర్ని వరకు కొనసాగింది. ఇప్పటివరకు పాదయాత్ర మొత్తం 1290 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈరోజు వరకు 9 జిల్లాలు పూర్తి చేసుకుని 10 వ జిల్లాలోకి ప్రవేశించింది.  

Don't Miss