జిల్లాలో నేతలతో భేటీ కానున్న జగన్..

19:16 - December 4, 2016

విజయవాడ : పార్టీ కార్యక్రమాలపై వైసీపీ అధినేత జగన్‌ దృష్టి సారించారు. పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న గడప గడపకు వైసీపీపై రెండురోజుల పాటు సమీక్షలు నిర్వహించాలని అధినేత నిర్ణయించారు. సోమ, మంగళవారాల్లో అన్ని జిల్లాల్లోని వైసీపీ నేతలతో సమీక్ష జరగనుంది. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జులై 8వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని పార్టీ మొదలు పెట్టింది. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు అయినా ఇంకా ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్న అభిప్రాయంతో ప్రధాన ప్రతిపక్షం ప్రజల్లో ఉండాలని నిర్ణయించింది. ప్రభుత్వం విఫలమైన పలు కార్యక్రమాలపై ప్రశ్నావళిని రూపొందించి ప్రజల్లోకి వెళ్లి ప్రతి ఇంటి నుంచి అభిప్రాయాలను సేకరించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. గడప గడపకు వైసీపీ మొదలు పెట్టిన నాటి నుంచి జరుగుతున్న కార్యక్రమాలపై పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నేతల తీరుపై అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. పార్టీ నేతలు అనుకున్న స్థాయిలో ఇంటింటికి వెళ్లడం లేదన్న అభిప్రాయంతో వారిపై జగన్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఆధిపత్య పోరు..
పలు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరుతో ఈ కార్యక్రమం నీరుగారిపోతుందన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో గడపగడపకు వైసీపీ మొదలు పెట్టి కూడా దాదాపు ఆరు నెలలు అవుతోంది. నిరంతరం పార్టీ నేతలు ప్రజల మధ్య ఉండే విధంగా కార్యక్రమాన్ని మరిన్ని రోజులు కొనసాగించే అవకాశాలున్నట్లు సమాచారం. 5వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు, 6వ తేదీన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల నేతలతో జగన్ సమావేశం కానున్నారు. రాబోయే రోజుల్లో అధికార పార్టీపై మరింత దూకుడుగా వెళ్లాలని వైసీపీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయి నుంచే కార్యాచరణ ఉండాలన్న అభిప్రాయంతో పార్టీ అధినేత జగన్ ఉన్నట్లు సమాచారం.

Don't Miss