లోక్ సభలో పోలవరంపై అభ్యంతరాలు..

13:51 - December 8, 2016

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై లోక్‌సభలో టిఆర్‌ఎస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల భద్రాచల రామమందిరం మునిగిపోతుందని, ఆదీవాసీల జనజీవనం అస్తవ్యస్తమవుతుందని టిఆర్‌ఎస్‌ సభ్యులు సీతారాం నాయక్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని ఎత్తు తగ్గించాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు కూడా లేవని పేర్కొన్నారు. భద్రాచలం లోని రామమందిరం పోలవరం ముంపు కిందకు రాదని కేంద్ర జలవనరుల సహాయ మంత్రి సంజీవ్‌ కుమార్‌ బలయాన్‌ స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై ఒడిషా తీవ్ర అభ్యంతరం
పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై లోక్‌సభలో ఒడిషా తీవ్ర అభ్యంతరం తెలిపింది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై ఒడిషా, ఛత్తీస్‌గడ్‌, తెలంగాణ రాష్ట్రాల ఆందోళనను కేంద్రం పట్టించుకోవడం లేదని బిజెడి సభ్యులు బలభద్ర మాఝీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల లక్షలాది మంది ఆదీవాసీల జీవనంపై ప్రభావం చూపనుందన్నారు. ఛత్తీస్‌గడ్‌, ఒడిషాలో గ్రామసభలు ఏర్పాటు చేయకుండా ప్రాజెక్ట్‌లు ఎలా నిర్మిస్తారని మాఝీ కేంద్రాన్ని నిలదీశారు. పోలవరాన్ని పెద్దగా నిర్మించడం కన్నా 3 చిన్న ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా ఎలాంటి ప్రమాదం ఉండదని... ఖర్చు కూడా సగం తగ్గనుందని అప్పటి ఏపి చీఫ్‌ ఇంజనీర్‌ హనుమంతప్పరావు చేసిన సూచనలు కూడా కేంద్రం పట్టించుకోకుండా ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రాజెక్ట్‌ నిర్మాణం ప్రారంభమైనందున దీనిపై వెనక్కి తగ్గేదిలేదని, ఒడిషా, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాలకు ఏదైనా అభ్యంతరం ఉంటే కేంద్రం సహకరిస్తుందని కేంద్రమంత్రి సంజీవ్‌ బలయాన్‌ సమాధానమిచ్చారు.

Don't Miss