చుక్కల్లో ఏపీ భూములు..

10:11 - July 31, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. గ్రామాలతోపాటు రహదారులు, జాతీయ రహదారుల వెంబడి ఉన్న భూముల ధరలు నింగిని తాకనున్నాయి. ఆగస్టు1 నుంచే కొత్తధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

29 గ్రామాల్లో శరవేగంగా రాజధాని నిర్మాణం
రాజధానిగా అమరావతిని ప్రకటించాక అక్కడి భూముల ధరలు చుక్కలంటుతున్నాయి. తాజాగా భూముల ధరలు పెంచేందుకు సర్కార్ మొగ్గు చూపుతోంది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో రాజధాని నిర్మాణంలో వేగం పెంచిన ప్రభుత్వం.. రాజధానితో పాటు.. కొన్ని ప్రాజెక్టులకు కూడా భూములు అవసరమని నిర్ణయించింది. దీంతో రియల్ ఎస్టేట్ ధరలు అందనంత ఎత్తుకు చేరే అవకాశం కనిపిస్తోంది.

ఎకరా ధర రూ. 5.50లక్షల నుంచి రూ.5.77లక్షలు..
ఉండవల్లి, నవులూరు, కృష్ణాయపాలెం, కురగల్లు, నిడమర్రు, పెనుమాక, వెంకటాయపాలెం పరిధిలో ప్రాంతాన్ని బట్టి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎకరా ధర 5లక్షలా 50వేల నుంచి 5లక్షలా 77వేలకు, 6లక్షలా 60వేలనుంచి, 6 లక్షలా 93వేలకు, 9లక్షలా 90వేలనుంచి, 10 లక్షలా 39వేలకు , 11లక్షలనుంచి 11లక్షలా 55వేలకు, 19లక్షలా 80వేలనుంచి, 20 లక్షలా79వేలకు చేరనున్నాయి. చెన్నై-కోల్‌కతా హైవేను ఆనుకుని ఉన్న.. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, ఆత్మకూరు, పెదవడ్లపూడి, చినవడ్లపూడి, కుంచనపల్లి, నూతక్కి, రామచంద్రాపురం, విప్పటం, కొలనుకొండ, గుండిమెడ, పెదరావూరు, చిర్రావూరు గ్రామాల్లోనూ ఒక్కోచోట ఒక్కో ధర ఉంది.

గుండిమెడలో రూ. 27. 50లక్షలు నుంచి రూ. 28.87లక్షలు..
గుండిమెడలో ప్రస్తుతం ఎకరా 27లక్షలా 50వేలు ఉండగా.. 28లక్షలా 87వేలకు చేరుకోనుంది. మంగళగిరిలో 33 లక్షలు ఉన్నభూమి 34లక్షలా 65వేలు కానుంది. కుంచనపల్లిలో ప్రస్తుతం 50 లక్షలు ఉండగా.. 52లక్షలా 56వేలకు వెళ్లనుంది. చిన్నవడ్లపూడి 46లక్షలా 20వేలు కాగా, 48 లక్షలా 51 వేలకు, నూతక్కిలో 19 లక్షలా 80వేలనుంచి 20 లక్షలా 79వేలకు పెరుగనున్నాయి. చిర్రావూరు 16 లక్షలా 50వేలు కాగా.., 17 లక్షలా 32వేలకు, కొలనుకొండ 40 లక్షలు కాగా 42 లక్షలకు చేరనుంది.

ఎకరా రూ.6.60లక్షలు నుంచి 6.93లక్షలు కానుంది..
మందడం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో మందడం, తాళ్లాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, మోదుగుల లంకపాలెం, మల్కాపురం, వెలగపూడి, కొండమరాజుపాలెంలో.. ఎకరా 6లక్షలా 60వేలు ఉండగా.. 6 లక్షలా93వేలకు చేరుకోనుంది. తుళ్లూరు కార్యాలయం పరిధిలోని తుళ్లూరు, నేలపాడు, దొండపాడు, పిచ్చుకులపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, రాయపూడి గ్రామాల పరిధిలో ఏరియాను బట్టి ధర ఉంది. 3లక్షలా 30వేలనుంచి 3లక్షలా 46వేలు, 4లక్షలా 40వేల నుంచి 4లక్షలా 62వేలు, 6లక్షలా 60వేల నుంచి 6లక్షలా 93వేలు, 8లక్షలా 80వేల నుంచి 9లక్షల 24వేలు ధర పలుకుతోంది.అనంతవరం సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని అనంతవరం, నెక్కల్లు, ఐనవోలు, శాఖమూరు గ్రామాల్లో 3లక్షలా 30వేలున్న ఎకరా భూమి.. 3లక్షలా 46 వేలకు చేరుకోనుంది. ఈ నిర్ణయం రాజధాని ముఖ్య ప్రాంతాలను దృష్టిలో పెట్టుకునే తీసుకున్నారు. 29 గ్రామాలతోపాటు రాజధాని సమీపంలోని ప్రముఖ ప్రాంతాల్లోని ధరల్లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. 

Don't Miss