టీఆర్ఎస్ పై కొండా తిరుగుబాటు

13:46 - September 8, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ పై కొండా సురేఖ తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. జాబితాలో తన పేరును ప్రకటించకపోవండపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనకు టికెట్ కేటాయించకపోవడంపై తీవ్రమనస్థాపాన్ని వ్యక్తం చేశారు. తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని సురేఖ డిమాండ్ చేశారు. నాలుగు సార్లు వరుసుగా గెలిచిన తనను ఆపడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. వరంగల్ లో 12 టిక్కెట్లు ప్రకటించి తనను మాత్రమే ఎందుకు ఆపారని నిలదీశారు. 'పార్టీలో మేం చేసిన తప్పేంటి ? మేం చేసిన నష్టమేంటీ ?' అని అడిగారు. తనకు టికెట్ ఇవ్వనందుకు స్పష్టంగా సమాధానం చెప్పాలన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడం అంటే బీసీలను అవమానపరచడమేనని స్పష్టం చేశారు. ఎవరి ప్రభావంతో తనకు టికెట్ ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అందరి సర్వే రిపోర్టులను బహిర్గతం చేయాలన్నారు. బీఫామ్ ఇచ్చిన వారికి నూటికి నూరుపాళ్లు సీటు ఇస్తామని చెప్పాలన్నారు. ఇప్పుడు ప్రకటించిన 105 మందికీ బీ.ఫాం ఇస్తారా? అని ప్రశ్నించారు. 105 మంది జాబితాలో ఎన్నికల నాటికి సగం మందిని లేపేస్తారని పేర్కొన్నారు. 
కేటీఆర్ పై విమర్శలు 
కేటీఆర్ పై సురేఖ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేటీఆర్ ద్వారానే తాము టీఆర్ ఎస్ లో చేరామని... కానీ కేటీఆర్ తమకు ఏ రోజూ అండగా నిలబడలేదన్నారు. తమకు అన్యాయం చేసింది కేటీఆరే అని ఆరోపించారు. కేటీఆర్ తన కోటరీని తయారు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిస్తే కేటీఆర్... తన వాళ్లకే మంత్రి పదువులు ఇచ్చుకుంటారని తెలిపారు. అందుకే తమలాంటి వాళ్లను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
పొమ్మనలేక పొగబెడుతున్నారు... 
తమ ఫోన్లు, డ్రైవర్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు తమ అనుచరులపైనే రౌడీ షీట్లు తెరిపించారని పేర్కొన్నారు. తమపై దుష్ప్రచారం చేస్తున్నారని..'మమ్మల్ని పొమ్మనలేక పొగబెడుతున్నారు' అని వాపోయారు. తనకు గానీ, తన కుమార్తెకు గానీ ఎవరో ఒకరికే టికెట్ ఇస్తామన్నారని తెలిపారు. భూపాలపల్లి ఇవ్వడం కుదరదు, పరకాకల ఇస్తామన్నారని చెప్పారు. పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే చేస్తామన్నామని తెలిపారు. వరంగల్ ఈస్ట్ కే టికెట్ ఇవ్వమని చివరగా చెప్పామన్నారు. భూపాలపల్లిలో మధుసూదనాచారికి టికెట్ ఇవ్వకపోతోనే తమకివ్వమని చెప్పామని తెలిపారు. భూపాలపల్లిలో మధుసూదనాచారిపై వ్యతిరేకత ఉందన్నారు. తమ సపోర్టుతోనే మధుసూదనాచారి గెలిచారని పేర్కొన్నారు. 
పార్టీ గుర్తుపై గెలిచిన మేం చేదయ్యామా?  
తనపై ఒత్తిడి చేసి వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేయించారని పేర్కొన్నారు. కేసీఆర్ మాట మేరకు వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేశానని తెలిపారు. పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎన్నికల్లో గెలిచానని తెలిపారు. వరంగల్ ఎంపీ సీట్ నుంచి కడియం నిలబడితే ఖర్చంతా తామే పెట్టుకున్నామన్నారు. ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ తామే ఖర్చు పెట్టామని తెలిపారు. ఆయన ముద్దై, పార్టీ గుర్తుపై గెలిచిన మేం చేదయ్యామా? అని ప్రశ్నించారు. 
తెలంగాణ.. కల్వకుంట్ల వారి ఇల్లు కాదు...
తనకు మంత్రి పదవి, మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదన్నారు. తనకు, మురళికి బిఫామ్ లు తప్ప టీఆర్ ఎస్ నుంచి తమకేమీ రాలేదన్నారు. మమ్మల్ని వ్యతిరేకించే ఎర్రబెల్లిని పార్టీలోకి తెచ్చుకున్నారని పేర్కొన్నారు. సారయ్య, గుండు సుధారాణి, ఎర్రబెల్లిని పార్టీలో చేర్చుకునేటప్పుడూ తమకు చెప్పలేదన్నారు. మహిళకు మంత్రి పదవి ఇవ్వకుండా టీఆర్ ఎస్ చరిత్రలో నిలిచిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ అనేది కల్వకుంట్ల వారి ఇల్లు కాదన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంపై వివరణ వచ్చాకే తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. కార్యకర్తలు ఉన్నంత వరకు తనకు ఎలాంటి భయం లేదన్నారు. ఎక్కడైనా పోటీ చేసి గెలిచే సత్తా ఉందన్నారు. రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటామన్న విషయంపై బహిరంగ ప్రకటన చేస్తామని చెప్పారు. వారు తీసుకునే నిర్ణయంపై తన నిర్ణయం ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

 

Don't Miss