కోఫి అన్నన్ ఇకలేరు...

20:40 - August 18, 2018

ఢిల్లీ : ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్‌, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కోఫీ అన్నన్‌ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా కోఫీ అన్నన్‌ మృతిచెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చివరి రోజుల్లో భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఆయనతోనే ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం అస్వస్థతకు గురైన కోఫి అన్నన్‌ను స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో ఓ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గొప్ప వ్యక్తిని, నాయకుడిని, ముందుచూపు గల వ్యక్తిని కోల్పోయామని ఐక్యరాజ్యసమితి వలసల విభాగం ట్విటర్‌ ద్వారా నివాళులర్పించింది. ఆఫ్రికా నుంచి ఐక్యరాజ్యసమితికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు అన్నన్‌. జనవరి 1, 1997 నుంచి డిసెంబరు 31, 2006 వరకూ పదేళ్ళపాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. 2001లో ఆయనకు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. ఘనాలోని కుమాసిలో జన్మించిన అన్నన్‌ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఐక్యరాజ్యసమితిలో ప్రధాన కార్యదర్శిగా ప్రపంచ శాంతి కోసం కోఫీ అన్నన్‌ ఎంతగానో కృషి చేశారు. సమగ్రాభివృద్ధి, మానవ హక్కుల కోసం కూడా ఆయన పాటుపడ్డారు. 

Don't Miss