ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే..

21:35 - December 1, 2016

వెలగపూడి : వెలగపూడి కొత్త సచివాలయంలో తొలిసారిగా సమావేశమైన ఏపీ మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పెద్దనోట్ల రద్దు సమస్యల పరిష్కారం, పోలవరం, రాజధాని నిర్మాణాలపై పర్యవేక్షణతోపాటు కొత్తగా పెన్షన్ల మంజూరిపై నిర్ణయాలు తీసుకుంది.

రాష్ట్రంలో నగదురహిత లావాదేవీల కోసం చర్యలు
వెలగపూడిలో తొలిసారి సమావేశమైన ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేబినెట్‌ ప్రధానంగా చర్చించింది. ఇప్పటివరకు నోట్ల రద్దు కారణంగా రాష్ట్రం 800కోట్లు నష్టపోయిందని మంత్రులు తెలిపారు. ఈ నెలాఖరుకు నష్టం 1500కోట్లకు చేరుకుంటుందని సమావేశంలో అంచనావేశారు. బంగారంపై పరిమితి విధించడాన్ని వ్యతిరేకించాలని మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబుకు సూచించారు. అలాగే రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్లాన్‌ను రూపొందించారు. జిల్లా,డివిజన్‌, మండల, గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలకు జిల్లా ఇంచార్జిమంత్రి చైర్మన్‌గా , కలెక్టర్‌ వైస్‌చైర్మన్‌గా వ్యవహరిస్తారని మంత్రి పల్లె తెలిపారు.

రాష్ట్రంలో కొత్తగా 3లక్షల మందికి పెన్షన్లు
రాష్ట్రంలో కొత్తగా 3లక్షల మందికి వృద్ధాప్య , వికలాంగ, వితంతు పెన్షన్లు మంజూరు చేయాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించినట్టు మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి తెలిపారు.

పోలవరం, అమరావతి పనులపై ప్రతిరోజు సమీక్ష
పోలవరం ప్రాజెక్టుతోపాటు రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని ఇక నుంచి మరింత వేగవంతం చేయనున్నారు. కేంద్రం నుంచి నిధుల మంజూరి దగ్గర నుంచి.. కొత్త టెక్నాలజీ వాడుకుని పనుల్ని యుద్ధప్రాతిపథికన పూర్తి చేయడానికి నిర్ణంయ తీసుకున్నట్టు మంత్రి పల్లె చెప్పారు. ప్రాజెక్ట్‌ల పనులపై ఇక నుంచి ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తామన్నారు.

మేయర్లు, చైర్మన్‌లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు జీతాలు పెంపు
కొత్త సచివాలయంలో జరిగిన తొలి సమావేశంలోనే మంత్రివర్గం పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తీపికబురు చెప్పింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో.. మేయర్లు, చైర్మన్‌లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నారాయణ చెప్పారు.

పరిశ్రమల స్థాపనకోసం ఏపీఐఐసికి భూముల కేటాయింపు
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడానికి ..ఏపీఐఐసీకి పలు జిల్లాల్లో భూములు కేటాస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అటు అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసేందుకు.. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం అగ్రిగోల్డ్‌ ఆస్తులను వేలంవేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పల్లె. ఇటీవల మృతి చెందిన ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు.. మంగళంపల్లి బాలమురళికృష్ణ కు మంత్రివర్గం సంతాపం తెలిపింది. 

Don't Miss