నందమూరి ఫ్యామిలీకి ప్రమాదాలకు సంబంధం?!..

21:46 - August 29, 2018

హైదరాబాద్ : నందమూరి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో హరికృష్ణ పెద్దకుమారుడు జానకిరామ్‌ రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందగా.. ప్రస్తుత ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందారు. ఇక 2009లో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రమాద బారిన పడ్డారు. సూర్యాపేట సమీపంలోని మోతె గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్‌ గాయపడ్డారు.

టీడీపీ సీనియర్‌ నేత, సినీనటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. నల్లగొండ జిల్లా సమీపంలోని అన్నేపర్తి వద్ద హరికృష్ణ కారు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలు పాలైన హరికృష్ణను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలో కామినేని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ హరికృష్ణ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌ నుండి నెల్లూరులోని ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంశంగా ప్రమాదాలు
హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో ఇప్పుడు ఓ అంశం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంశమైంది. గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్‌ రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు. హైదరాబాద్-విజయవాడ రహదారిపై ఆకుపాముల వద్ద జరిగిన ప్రమాదంలో జానకీరామ్‌ మృతి చెందారు. జానకీరామ్‌ ఒంటరిగా టాటా సఫారీ వాహనంలో విజయవాడకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. రాంగ్‌ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ను జానకీరామ్‌ వాహనం ఢీ కొనటంతో జానకీరామ్‌ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. జానకీరామ్‌ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందారు.

2009 ఎన్నికల్లో టీడీపీ ప్రచారానికి వెళ్లిన ఎన్టీఆర్‌
ఇక హీరోగా మంచి గుర్తింపు సాధించిన జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా రోడ్డు ప్రమాదం వెంటాడింది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేయటానికి ఎన్టీఆర్‌ ఖమ్మం జిల్లా వెళ్లారు. ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా.. సూర్యాపేట సమీపంలో గల ఓ పదునైన మలుపు వద్ద ఎన్టీఆర్‌ ప్రయాణిస్తున్న టాటా సఫారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్‌ తలకు, భుజానికి, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఎన్టీఆర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఎన్టీఆర్‌ చికిత్స పొందారు. నందమూరి కుటుంబంలో జరిగిన ఈ ప్రమాదాల్లో ఎన్టీఆర్‌ మినహా మిగతా వారు మరణించారు.

నల్గొండ జిల్లాలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీ కొడుకులు
హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరో విషయం కూడా ఇప్పుడు చర్చనీయంశమైంది. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్‌ ప్రయణించిన కారు నెంబర్‌ ఏపీ 29 బీడీ 2323 కాగా.. ప్రస్తుతం హరికృష్ణ ప్రయాణించిన కారు నెంబర్ కూడా ఏపీ 28 బీడబ్ల్యూ 2323. అయితే 2323 సిరీస్ నందమూరి కుటుంబానికి కలిసిరాలేదని అభిమానులు భావిస్తున్నారు. కుమారుడు ఇష్టపడి రిజిస్ట్రేషన్ చేయించుకున్న నంబర్ కావడంతో ఇదే సిరీస్‌లో హరికృష్ణ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండొచ్చిన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, తండ్రీకొడుకులిద్దరూ నల్గొండ జిల్లాలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇక ఎన్టీఆర్‌ ప్రమాదం కూడా నల్లగొండ జిల్లాలోనే జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్‌ కుటుంబాన్ని ప్రమాదాలు వెంటాతుండటం పట్ల అభిమానులను కలచివేస్తోంది.

 

Don't Miss