తమిళనాడు నూతన సీఎం పన్నీర్ సెల్వం ?

17:14 - December 5, 2016

చెన్నై : తమిళనాడు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం నియమితులు కానున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. గత కొన్ని రోజులుగా సీఎం జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఆరోగ్యం మరింత విషమించడంతో రాష్ట్ర మంత్రివర్గం సోమవారం భేటీ అయ్యింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. పన్నీర్ సెల్వంకు మద్దతుగా 135 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసినట్లు, సాయంత్రం అధికారికంగా ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

పరామర్శించిన వైగో..
ఇదిలా ఉంటే జయ ఆరోగ్య పరిస్థితిపై లండన్ నుండి వచ్చిన వైద్యుడు రిచర్డ్ బేలే ఓ మెయిల్ పంపారు. జయను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రపంచంలోనే ఆధునాతన చికిత్స అందిస్తున్నామన్నారు. అయినా గుండెపోటు రావడం దురదృష్టకరమన్నారు. జయను ఎండీఎంకే నేత వైగో పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉందని పేర్కొన్నారు. అమ్మ కోలుకోవాలని ప్రజలు ప్రార్థనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

భారీగా పోలీసులు...
రాష్ట్రం మొత్తం భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. కేంద్ర బలగాలు కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. సీఎం జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందని అపోలో వైద్యులు ప్రకటించడంతో తీవ్ర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. పరిస్థితిపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరా తీశారు. ఇప్పటికే పోలీసులకు సెలవులు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

అభిమానుల ఉద్వేగం..
జయ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తోందన్న వార్తలు వస్తుండడంపై అభిమానులు తీవ్ర ఉద్విగ్నానికి గురవుతున్నారు. జయ కోలుకోవాలంటూ రోదిస్తున్నారు. కొంతమంది అభిమానులు ఆసుపత్రి మెయిన్ గేట్ వైపుకు దూసుకొచ్చారు. పోలీసులు, జయ అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంటోంది.

Don't Miss