ఆందోళనకరంగా అమ్మ ఆరోగ్యం..

10:39 - December 5, 2016

తమిళనాడు : సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 73 రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను ఐసీయూకు తరలించి వైద్యం అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. జయ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని హుటాహుటిన మంత్రులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు అపోలో ఆస్పత్రికి బారులు తీరారు. రాత్రంతా ఆస్పత్రి వద్దనే వేచివున్నారు. అభిమనులు అమ్మ కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జయకు సీరియస్‌గా ఉండడంతో మంత్రులంతా ఆస్పత్రి ఆవరణలోనే కేబినెట్‌ మీటింగ్‌ నిర్వహించారు. జయ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు చెన్నైకు హుటాహుటిన తరలివచ్చారు. ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అపోలో ఆస్పత్రి చైర్మన్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన విద్యాసాగర్‌రావు.. మంత్రులతో భేటీ అయ్యారు. జయ ఆరోగ్య పరిస్థితి గురించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.. గవర్నర్‌కు ఫోన్‌ చేసి తెలుసుకున్నారు. ఈరోజు కేంద్రమంత్రులు నడ్డా, నితిన్‌ గడ్కరీలు చెన్నైకు రానున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా డీజీపీ.. పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసుల సెలవులను రద్దు చేశారు.. ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారిని విధుల్లో చేరాలని ఆదేశించారు. జయ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈరోజు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈరోజు జరగనున్న పరీక్షలను రద్దు చేశారు. ఇక జయ ఆరోగ్యంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోదీ స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేశారు.

అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు..
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు వచ్చింది. జయలలిత ఆరోగ్యాన్ని 8మంది డాక్టర్లతో కూడిన వైద్యం బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దీంతో జయ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనలో వున్నారు.ఆస్పత్రికి భారీగా అభిమానులుచేరుకున్నారు.ఆస్పత్రిలోకి చొచ్చుకెళ్లేందుకు అభిమానులు, కార్యకర్తల యత్నం...అడ్డుకున్న పోలీసులు..ఆపోలో ఆస్పత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సెప్టెంబ‌రు 22 అపోలో ఆసుప‌త్రిలో చేరిన జయలలిత
జ్వరం, డీ హైడ్రేషన్‌తో బాధ‌ప‌డుతూ జయలలిత సెప్టెంబ‌రు 22వ తేదీన చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చేరారు. అప్పటి నుంచి అంటే 73 రోజుల నుంచి అపోలో ఆస్పత్రిలోనే జయ చికిత్స పొందుతున్నారు. జయ పూర్తిగా కోలుకున్నారని ఈ మధ్యే అపోలో ఆస్పత్రి ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. చికిత్సలో భాగంగా జ‌య‌ల‌లిత‌కు ప్రతిరోజూ కొద్ది స‌మ‌యం కృత్రిమ శ్వాస అందిస్తున్నామని, కొద్దిరోజుల్లో ఆమె లేచి నిలబడి, నడుస్తార‌ని కూడా చెప్పడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అపోలో వైద్య బృందంతో పాటు లండన్‌ ప్రత్యేక వైద్య నిపుణులు, ఎయిమ్స్‌కు చెందిన ముగ్గురు వైద్యుల ఆధ్వర్యంలో జయలలిత చికిత్స పొందారు. అయితే ఇంతలోనే జయకు మళ్లీ గుండెపోటు రావడంతో అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.

అమ్మ కోలుకోవాలంటూ అభిమానులు..
అమ్మ త్వరితగతిన కోలుకోవాలంటూ అన్నాడిఎంకె నేతలు, కార్యకర్తలు పూజలు, హోమాలు, యాగాలు, సామూహిక ప్రార్ధనలు కొనసాగిస్తున్నారు. ఆమెకోసం ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. అమ్మ ఆరోగ్యంపై ఆందోళనతో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు అపోలో ఆస్పత్రి వద్దనే పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం జయలలిత అనారోగ్యం బారిన పడటంతో తమిళనాడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

 

Don't Miss