'అమ్మ' ఎప్పుడు కోలుకుంటారో..

14:14 - December 5, 2016

ఢిల్లీ : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత...ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ? ఎలాంటి చికిత్స అందిస్తున్నారు ? ఎప్పుడు కోలుకుంటారు ? తిరిగి పాలన ఎప్పుడు చేపడుతారు ? ఇలాంటి వాటిపై తమిళనాడులో చర్చ జరుగుతోంది. చెన్నై..తదితర ప్రాంతాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. 73 రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో సీఎం 'జయలలిత' కు వైద్య చికిత్స కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఆదివారం గుండె పోటు..
అకస్మాత్తుగా ఆదివారం రాత్రి జయకు గుండెపోటు వచ్చిందన్న వార్తలు దావానంలా వ్యాపించాయి. దీనితో అప్పటి నుండి ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అపోలో ఆసుపత్రి..తదితర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కేంద్రం నుండి పలు బెటాలియన్లు బందోబస్తులో పాల్గొంటున్నాయి. రాష్ట్రంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా డీజీపీ.. పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసుల సెలవులను రద్దు చేశారు.. ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారిని విధుల్లో చేరాలని ఆదేశించారు. ఈ వార్త తెలుసుకున్న జయ అభిమానులు..అన్నాడీఎంకే నేతలు..కార్యకర్తలు అపోలో ఆసుపత్రికి భారీగా చేరుకున్నారు. ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు నిలువరించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాత్రి నుండి అక్కడే అభిమానులు వేచి చూస్తూ 'అమ్మ' ఆరోగ్యం బాగు కావాలని కోరుకుంటున్నారు.

కేంద్రం ఆరా..
జయలలిత ఆరోగ్యంపై కేంద్రం ఆరా తీస్తోంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెన్నైకి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జయ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈరోజు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈరోజు జరగనున్న పరీక్షలను రద్దు చేశారు. ఇక జయ ఆరోగ్యంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోదీ స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేశారు.

జయ హెల్త్ బులెటిన్..
జయ ఆరోగ్యంపై కాసేపటి క్రితం చెన్నై అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. ఎప్పుడు కోలుకుంటారో చెప్పలేమని వైద్యులు పేర్కొంటుండడంపై అభిమానులు..ఏఐడీఎంకే నేతలు..కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. జయ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని హెల్త్ బులెటిన్ లో వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం నలుగురితో కూడిన ఎయిమ్స్ బృందం జయకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈసీఎమ్ ఓ, లైఫ్ సపోర్టు సిస్టమ్స్ ద్వారా చికిత్స కొనసాగుతోంది. నేటి సాయంత్రం మరో హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది.

Don't Miss