జయ' ఆరోగ్యం..అత్యంత విషమం..

19:33 - December 5, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఆమెకు గుండెపోటు రావడంతో.. ఐసీయూకు తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. లండన్‌ వైద్యుడు రిచర్డ్‌ బేలెతో పాటు ఎయిమ్స్‌ వైద్యుల బృందం జయలలితకు అత్యాధునిక చికిత్స అందిస్తున్నారు. జయ ప్రాణాలు కాపాడేందుకు ఎక్మో, లైఫ్‌ సపోర్టింగ్‌ సిస్టంతో చికిత్స అందిస్తున్నారు. జయ త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. అమ్మ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు కేంద్ర బలగాలను రాష్ట్రానికి తరలించారు.

అత్యాధునిక చికిత్స..
గుండెపోటుకు గురైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మరింత విషమంగా మారింది. చెన్నై అపోలో ఆసుపత్రిలో లండన్‌ వైద్యుడు రిచర్డ్‌తో పాటు ఎయిమ్స్‌ వైద్యుల బృందం జయకు అత్యాధునిక చికిత్సను అందిస్తున్నారు. హృద్రోగ, శ్వాసకోశ వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జయకు ఎక్మో, లైఫ్‌ సపోర్ట్‌ ద్వారా అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యాధుని వైద్యాన్ని జయకు అందించామని, ఇక మన ప్రార్థనలే ఆమెను కాపాడాలని లండన్‌ వైద్యుడు రిచర్డ్‌ బేలే ఆకాంక్షించారు.

పరిస్థితి ఉద్రిక్తం..
జయలలితకు గుండెపోటు వచ్చిందన్న పిడుగులాంటి వార్త.. అభిమానులు, పార్టీ కార్యకర్తలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మంత్రులు, పార్టీ నేతలు, అపోలో ఆసుపత్రి వద్దకు భారీగా తరలివచ్చారు. మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్‌ విద్యాసాగర్‌రావు హుటాహుటిన చెన్నైకి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జయ ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, డీఎంకే నేతలు కరుణానిధి, స్టాలిన్‌, కేంద్రమంత్రులు ఆకాంక్షించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు పోలీసులు ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమ్మ ఆరోగ్యంపై ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని కేంద్ర బలగాలను రాష్ట్రానికి తరలించారు. అపోలో హాస్పిటల్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ప్రార్థనలు..
పెద్ద మొత్తంలో మహిళలు హాస్పిటల్ వద్దకు చేరుకుని.. అమ్మ కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అమ్మ వాజ్‌గా, పురచ్చి తలైవి వాజ్‌గా అంటూ... విప్లవ నాయకురాలు చిరకాలం వర్ధిల్లాలంటూ నినాదాలు చేస్తున్నారు. హాస్పిటల్ వద్దకు వచ్చే అన్ని ప్రధాన రహదారులపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. చెన్నైతో పాటు రాష్ట్రమంతటా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. జయ నివాసం పోయెస్ గార్డెన్ వద్ద సైనిక బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కర్ణాటక నుంచి తమిళనాడుకు వచ్చే బస్సుల సర్వీసులను నిలిపివేశారు. తమిళనాడులో ఉన్న కేఎస్‌ఆర్టీసీ బస్సులను కర్ణాటకకు తీసుకురావాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు. ఇరు రాష్ర్టాల సరిహద్దు ప్రాంతమైన హోసూరుకు సమీపంలో అత్తిబలే వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. పారామిలటరీ బలగాలనూ పంపాలని కేంద్రానికి తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. జయలలిత వారుసుడు ఎవరన్న దానిపై అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. పన్నీర్‌ సెల్వంను సీఎంగా ప్రకటించేందుకు ఉద్దేశించిన డిక్లరేషన్‌పై ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.

Don't Miss