విషమించిన జయలలిత ఆరోగ్యం..

10:41 - December 5, 2016

తమిళనాడు : సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. చెన్నై అపోలో ఆస్పత్రిలో 8 మంది వైద్యుల బృందం ఎక్‌మో మిషన్‌పై జయకు చికిత్స అందిస్తున్నారు. 73 రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను ఐసీయూకు తరలించి వైద్యం అందిస్తున్నారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు అపోలో ఆస్పత్రికి బారులు తీరారు. రాత్రంతా ఆస్పత్రి వద్దనే వేచివున్నారు. అభిమనులు అమ్మ కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జయకు సీరియస్‌గా ఉండడంతో మంత్రులంతా ఆస్పత్రి ఆవరణలోనే కేబినెట్‌ మీటింగ్‌ నిర్వహించారు. జయ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు చెన్నైకు హుటాహుటిన తరలివచ్చారు. ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అపోలో ఆస్పత్రి చైర్మన్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన విద్యాసాగర్‌రావు.. మంత్రులతో భేటీ అయ్యారు. జయ ఆరోగ్య పరిస్థితి గురించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.. గవర్నర్‌కు ఫోన్‌ చేసి తెలుసుకున్నారు. ఈరోజు కేంద్రమంత్రులు నడ్డా, నితిన్‌ గడ్కరీలు చెన్నైకు రానున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా డీజీపీ.. పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసుల సెలవులను రద్దు చేశారు.. ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారిని విధుల్లో చేరాలని ఆదేశించారు. జయ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈరోజు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈరోజు జరగనున్న పరీక్షలను రద్దు చేశారు. ఇక జయ ఆరోగ్యంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోదీ స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేశారు.

జ్వరం, డీ హైడ్రేషన్‌తో ఆసుపత్రిలో చేరిన జయలలిత
జ్వరం, డీ హైడ్రేషన్‌తో బాధ‌ప‌డుతూ జయలలిత సెప్టెంబ‌రు 22వ తేదీన చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చేరారు. అప్పటి నుంచి అంటే 73 రోజుల నుంచి అపోలో ఆస్పత్రిలోనే జయ చికిత్స పొందుతున్నారు. జయ పూర్తిగా కోలుకున్నారని ఈ మధ్యే అపోలో ఆస్పత్రి ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. చికిత్సలో భాగంగా జ‌య‌ల‌లిత‌కు ప్రతిరోజూ కొద్ది స‌మ‌యం కృత్రిమ శ్వాస అందిస్తున్నామని, కొద్దిరోజుల్లో ఆమె లేచి నిలబడి, నడుస్తార‌ని కూడా చెప్పడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అపోలో వైద్య బృందంతో పాటు లండన్‌ ప్రత్యేక వైద్య నిపుణులు, ఎయిమ్స్‌కు చెందిన ముగ్గురు వైద్యుల ఆధ్వర్యంలో జయలలిత చికిత్స పొందారు. అయితే ఇంతలోనే జయకు మళ్లీ గుండెపోటు రావడంతో అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.

రాష్ట్ర రాజకీయాల్లో కీలకపరిణామం
జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందే సమయంలో తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జయకు అత్యంత విధేయుడైన ఆర్ధికమంత్రి పన్నీర్‌ సెల్వంకు అప్పగిస్తూ రాజ్‌భవన్ ఉత్తర్వులు జారీచేసింది. అర్టికల్‌ 166 ప్రకారం కేబినెట్‌ సమావేశాలు నిర్వహించేందుకు పన్నీర్‌ సెల్వంకు అధికారాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జయలలిత నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరని విపక్షాలు ఆరోపించాయి. జయలలిత సూచన మేరకే ఆమె వద్ద ఉన్న పోర్టుఫోలియోలను పన్నీర్‌సెల్వానికి కేటాయించినట్లు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పేర్కొనడంపై డీఎంకే అధినేత ఎంకే కరుణానిధి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారమే గవర్నర్ నిర్ణయం తీసుకున్నారా? అంటూ ప్రశ్నించారు.మరోవైపు అమ్మ ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో రూమర్లు సృష్టించే వారిపై పోలీసులు చాలామంది అరెస్ట్‌ చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు.

అమ్మ కోలుకోవాలని అభిమానుల పూజలు
అమ్మ త్వరితగతిన కోలుకోవాలంటూ అన్నాడిఎంకె నేతలు, కార్యకర్తలు పూజలు, హోమాలు, యాగాలు, సామూహిక ప్రార్ధనలు కొనసాగిస్తున్నారు. ఆమెకోసం ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. అమ్మ ఆరోగ్యంపై ఆందోళనతో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు అపోలో ఆస్పత్రి వద్దనే పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం జయలలిత అనారోగ్యం బారిన పడటంతో తమిళనాడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

తమిళ రాకీయాల్లో విప్లవ నాయకిగా
పురట్చితలైవి..! తమిళ రాకీయాల్లో విప్లవ నాయకిగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ధీరవనిత. ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించినా.. తన నిర్ణయాలతో విపక్షాల ప్రశంసలనూ అందుకున్న అద్వితీయ నేత జయలలిత. డేరింగ్‌ ..డాషింగ్‌ పర్సనాలిటీతో తమిళ పాలిటిక్స్‌ కు రాకెట్‌ స్పీడ్‌ను నేర్పిన నాయకురాలు. ద్రవిడ పార్టీల పాలిటిక్స్ లో ఓ మిస్సైల్లా దూసుకొచ్చిన జయలలిత.. ప్రధాన ప్రత్యర్థి .. రాజకీయ దురంధరుడు కురుణానిధిని గిరిగీసి నిలువరించిన పొలిటికల్‌ చతురత ఆమెది. పెరియార్‌ రామస్వామి నాయకర్‌ ప్రారంభించిన ద్రవిడ మున్నేట్ర కళగం వేదికను.. మలిదశలో పరుగులు పెట్టించిన ఎంజీఆర్‌కు.. రాజకీయ వారసురాలిగా 1982లో ఘనంగా పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు జయ. ఆమె ఎంట్రీతో ద్రవిడపార్టీల ప్రాభవం ఉన్నత శిఖరాలకు చేరుకుంది. కామరాజ్‌ నాడార్‌ హయాంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో ఉనికే లేకుండా చేసిన చరిత్ర ద్రవిడ పార్టీలది. అందులోనూ జయలలిత ఎంట్రీ తర్వాత జాతీయ పార్టీలంటేనే తమిళ ప్రజలు మర్చిపోయే స్థాయి వచ్చింది. 1991లో మొదటిసారిగా సీఎం పగ్గాలు చేట్టిన జయ..ఎప్పటికపుడు కొత్తకొత్త ప్రజాకర్షక పథకాలతో విపక్షాలను .. ముఖ్యంగా డీఎంకే అధినేత కరుణానిధిని ఉక్కిరిబిక్కిరి చేశారు. 1996లో అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్న జయలలితపై డీఎంకే.. కక్షసాధింపుకు అసెంబ్లీనే సాక్షిగా నిలిచింది. అవమానాలు ఎదురైనా.. ధైర్యంగా ముందుకు సాగిన ధీశాలి. ఎన్నో సంక్షేమపథకాలు ప్రవేశపెట్టి.. అభాగ్యులను అన్నార్తులను .. ఆదుకోవడంలో జయ అందరికంటే ముందుంటారు. పవర్‌లో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆమె తమిళ రాజకీయాలను శాసించారు. అందుకే తమిళ ప్రజలు ఆమెను పురట్చితలైవి...అని సగర్వంగా చెప్పుకుంటారు.

Don't Miss