రిటైల్ వ్యాపారంపై పెద్ద నోట్ల రద్దుపై ప్రభావం

09:52 - December 2, 2016

సంప్రదాయ రిటైల్ వ్యాపారం మీద పెద్ద నోట్ల రద్దు, కరెన్సీ కొరత తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రిటైల్ వ్యాపారులు, చిల్లర కొట్ల వర్తకులు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఏపి ట్రేడర్స్ కన్వీనర్ కొణిజేటి రమేష్ 
చిల్లర కొట్ల వ్యాపారానికి ఆశనిపాతంలా పెద్ద నోట్ల రద్దు 
పెద్ద నోట్ల రద్దు చిల్లర కొట్ల వ్యాపారానికి ఆశనిపాతంలా మారింది. బిజినెస్ లు పడిపోవడంతో సంప్రదాయ కిరాణా దుకాణాలు కళతప్పుతున్నాయి. పెద్ద నోట్లను రద్దు చేయడంతో కిరాణా వర్తకులకు, చిల్లర కొట్ల వారికి పెద్ద కష్టమే వచ్చింది. ఓ వైపు కరెన్సీ కొరత, మరోవైపు చిల్లర సమస్య, ఇంకో వైపు క్యాష్ లెస్ ఎకానమీ పేరుతో మోడ్రన్ మార్కెట్లకు అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలు చిల్లర కొట్టు వ్యాపారానికి పెద్ద సవాలు విసురుతున్నాయి. మన దేశంలో   కిరాణా వ్యాపారం  సైజు 60 నుంచి 70 లక్షల కోట్ల దాకా వుంటుందన్న అంచనాలున్నాయి.  కిరాణా వ్యాపారాన్ని చేజిక్కించుకోవడానికి పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు పోటీ పడుతుండగా, వాల్ మార్ట్ లాంటి విదేశీ సంస్థలు సైతం ఉవ్విల్లూరుతున్నాయి.
నష్టపోతోన్న కిరాణా వ్యాపారం 
ఇప్పటిదాకా మన దేశంలో కిరాణా వ్యాపారంలో చిల్లర కొట్ల ఆధిపత్యం నడుస్తోంది. స్కూళ్లు, బ్యాంక్ లు, ఆస్పత్రులు, రోడ్లు, బస్సులు, కరెంటు లేని గ్రామాలున్నాయి కానీ చిల్లర కొట్టు లేని గ్రామం మనదేశంలో ఒక్కటి కూడా వుండదు. కోడికూసే వేళకే మేల్కొని, ఊరంతా నిద్రపోయే వరకు దుకాణం తెరచి వుంచడం చిల్లర కొట్టు వర్తకుల లక్షణం. అసలు ఆ మాటకొస్తే ఇల్లే కొట్టు. కొట్టే ఇల్లు. ఏదైనా అత్యవసర సమయంలో అర్ధరాత్రి వెళ్లి నిద్ర లేపినా అడిగిన సరుకు తీసుకొచ్చి ఇవ్వడం మన చిల్లర వర్తకుల లక్షణం. మన ఇంట్లో ఎవరు ఏ బ్రాండ్ వస్తువులు వాడతారో అవన్నీ గుర్తు పెట్టుకుని చిన్న పిల్లలను పంపినా మనకు కావాల్సింది ఇచ్చి పంపడంలో నిష్ణాతులు మన చిల్లర కొట్టువ్యాపారులు. తమ కస్టమర్లందరి పేర్లనూ గుర్తు పెట్టుకుని, పేరుపేరునా పలకరిస్తూ, అందరితో ప్రత్యక్ష సంబంధాలను కొనసాగించడం చిల్లర కొట్టు వ్యాపారుల విశిష్టత. తమ దగ్గర ఉన్న సరుకుకు పబ్లిసిటీ ఇచ్చి, అవసరం వున్నా లేకపోయినా మనతో కొనిపించడం మోడ్రన్ మార్కెట్ల లక్షణమైతే, మనకు అవసరమైన ప్రతి వస్తువునీ, పదార్ధాన్ని సిద్ధంగా వుంచడం, మనం ఏది అడిగినా లేదు అనకుండా తెచ్చి ఇవ్వడం చిల్లర కొట్లవారి లక్షణం. ఇన్ని సుగుణాలు వుండబట్టే, సూపర్ మార్కెట్ లు, హైపర్ మార్కెట్ లు, పెద్ద పెద్ద మాల్స్ ఎన్ని వచ్చినా చిల్లర కొట్టు వ్యాపారాలు తట్టుకొని నిలబడ్డాయి. ఈ వ్యాపారాన్ని కైవసం చేసుకునేందుకు విదేశీ సంస్థలు సైతం తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి. పెద్దపెద్ద మాల్స్ బిజినెస్ ఏటా 3 నుంచి 5 శాతం చొప్పున పెరుగుతుంటే ఆ మేరకు సంప్రదాయ కిరాణా వ్యాపారం నష్టపోతోంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చిల్లర కోట్ల వ్యాపారానికి పెద్ద గండే కొడుతోంది. జనం చేతిలో డబ్బు లేకపోవడంతో చాలా చోట్ల చిల్లర కొట్టు వ్యాపారాలు సగానికి పైగా పడిపోయాయంటున్నారు. దీంతో మన దేశంలో చిల్లర కొట్లు నిర్వహిస్తూ జీవనయానం సాగిస్తున్న దాదాపు 5 కోట్ల కుటుంబాల ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతోంది. 

 

Don't Miss