మనమ్మాయిలే గెలిచారు...

15:19 - December 4, 2016

బ్యాంకాక్ : భారత మహిళా క్రికెట్‌ జట్టు అద్భుత విజయం సాధించింది. ఆసియా కప్‌ మహిళా టీ ట్వంటీ కప్‌ విజేతగా నిలిచింది.. ఫైనల్‌లో 17 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. టోర్నీలో ఆడిన అన్ని మ్యాచుల్లో మిథాలీ సేన వరుస విజయాలతో దూసుకెళ్లింది. ఈ టోర్నీ గెలుపుతో... ఇప్పటివరకూ జరిగిన ఆరు ఆసియాకప్ మహిళా టోర్నీల్లోనూ టీమిండియానే విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది.

రాణించని పాక్..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ 73 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. మరోవైపు మిథాలికీ, జులాన్ గోస్వామి 17 పరుగులతో కొద్దిపాటి సహకారం అందించారు. మిగిలిన ప్లేయర్లలో ఒక్కరూ రెండంకెల స్కోరును సాధించలేకపోయారు. తరువాత బ్యాటింగ్‌ దిగిన పాకిస్తాన్‌ టీమ్...టార్గెట్‌ను సాధించే క్రమంలో పోరాడి ఓడింది. పాక్ ప్లేయర్స్‌లో 22 పరుగులతో జావిరియా ఖాన్, 25 పరుగులతో బిస్మా మరూఫ్ నాటౌట్‌గా నిలిచి... ఫర్వాలేదనిపించినా మిగతా వారు విఫలం కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.

ఆరింటిలో భారత్ విజేత..
ఇప్పటివరకూ ఆరు ఆసియాకప్ మహిళా టోర్నీలు జరగ్గా ఆరింటిలో భారత్ విజేతగా నిలిచింది. 2004 నుంచి 2008 వరకూ నాలుగు వన్డే ఆసియాకప్‌ టోర్నీలు జరిగాయి. ఆ తరువాత రెండు టీ ట్వంటీ టోర్నీలు జరిగాయి. చివరిసారి 2012లో జరిగిన మహిళల ఆసియాకప్ టీ ట్వంటీ ఫైనల్లో పాక్ పై భారత్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. నాలుగేళ్ల తరువాత అదే ఫలితాన్ని భారత్ పునరావృతం చేసింది.

Don't Miss