చెలరేగిన పూజారా..

10:48 - September 1, 2018

హైదరాబాద్ : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తి కరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో 273పరుగులకు భారత్‌ ఆలౌట్‌ అయింది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా చెలరేగి పోయాడు. వీరోచిత సెంచరీ చేశాడు. కెప్టెన్‌ కోహ్లీ ఆటతీరు ఫర్వాలేదనిపించింది. మిగతా బ్యాట్స్‌మెన్లంతా తక్కువ పరుగులకే వికెట్‌ కోల్పోయారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 84.5ఓవర్లలో 273పరుగులకే పెవిలియన్‌ దారి పట్టింది. ఇంగ్లాండ్‌ బౌలర్లు మొయిన్‌ అలీ ఐదు వికెట్లు, ఫాస్ట్‌ బౌలర్‌ బ్రాడ్‌ మూడు వికెట్లు తీశారు.

నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 195 పరుగులకే 8 వికెట్లు!.. ఈ స్థితిలో ఇంగ్లాండ్‌ గడ్డపై టీమ్‌ఇండియా ఆలౌట్‌ కావాలంటే ఎంత సమయం కావాలి? విజృంభిస్తున్న ఇంగ్లిష్‌ బౌలర్లను భారత టెయిలెండర్లు తట్టుకునేదెంతసేపు? కానీ చెతేశ్వర్‌ పుజారా 132 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు. 257 బంతుల్లో 16×4 చేసి ఇండియాకు కంచుకోటలా నిలిచాడు. కోహ్లి వికెట్‌ పడగొట్టామని సంబరపడిన ఇంగ్లాండ్‌ ఆనందానికి తెరదించుతూ ఒక్కడు భారత్‌ను ఆదుకున్నాడు. టెయిలెండర్ల సాయంతో.. అపరిమిత సహనాన్ని ప్రదర్శిస్తూ.. కఠోర దీక్షతో బ్యాటింగ్‌ చేసిన పుజారా.. అజేయ సెంచరీతో భారత్‌కు అనూహ్యమైన ఆధిక్యాన్ని అందించాడు. 

Don't Miss