'మహాభియోగ తీర్మానం'పై చర్చకు రాజ్యసభ ఒకే..

13:59 - December 7, 2016

ఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు జడ్జి జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డిని పదవీ నుంచి తొలగించాలని రాజ్యసభ సభ్యులు ఇచ్చిన మహాభియోగ తీర్మానం నోటీసుపై చర్చకు ఛైర్మన్‌ హామీద్‌ అన్సారీ ఆమోదం తెలిపారు. మూడు ప్రధాన అభియోగాలను నోటీసులో పేర్కొన్నారు. దళిత జడ్జిపై దాడి చేయడం.. అధికార దుర్వినియోగానికి పాల్పడటం.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగాలు ఉన్నాయి. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇచ్చిన ఈ నోటీసుపై ఆయనతో పాటు మరో 61 మంది ఎంపీలు సంతకాలు చేశారు.

నాగార్జున రెడ్డిని పదవీ నుంచి తొలగించాలంటూ 61 మంది ఎంపీల సంతకాలు
తనకు న్యాయం చేయాలంటూ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని మూడు నెలల క్రితం దళిత జూనియర్‌ సివిల్‌ జడ్జి రామకృష్ణ ఆశ్రయించారు. ఆధారాలను అన్నింటినీ పరిశీలించిన సీతారాం ఏచూరి.. ఉమ్మడి హైకోర్టు జడ్జి జస్టిస్‌ నాగార్జున రెడ్డిపై రాజ్యసభలో మహాభియోగ తీర్మానం నోటీసు ఇచ్చారు. జస్టిస్‌ నాగార్జున రెడ్డిని పదవీ నుంచి తొలగించాలని ఇచ్చిన నోటీసుపై వివిధ పార్టీలకు చెందిన 61 మంది ఎంపీలు సంతకాలు చేశారు.

రామానుజులును తెల్లకాగితంపై సంతకం చేయాలని పవన్ కుమార్ డిమాండ్‌
కడప జిల్లా రాయచోటి కోర్టులో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పని చేస్తున్న పవన్‌ కుమార్‌ రెడ్డి హైకోర్టు జడ్జి జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డి తమ్ముడు. 2012లో పవన్‌ కుమార్‌ రెడ్డి తన వద్ద పని చేస్తున్న రామానుజులు అనే వ్యక్తిని తెల్లకాగితం మీద సంతకం చేయాలని డిమాండ్‌ చేశారు. దానికి నిరాకరించడంతో రామానుజులుపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత రామానుజులు చనిపోతూ దళిత జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌. రామకృష్ణకు మరణ వాంగ్మూలాన్ని ఇచ్చారు. తన మరణానికి పవన్‌ కుమార్‌ రెడ్డినే కారణమంటూ వాంగ్మూలంలో స్పష్టం చేశాడు.

తమ్ముడి పేరును మరణ వాగ్మూలం నుంచి తొలగించాలని రామకృష్ణకు ఫోన్
2012 నవంబర్‌ 30న జస్టిస్‌ నాగార్జున రెడ్డి రామకృష్ణకు ఫోన్‌ చేసి తన తమ్ముడి పేరును మరణ వాగ్మూలం నుంచి తొలగించాలని ఆదేశించారు. అందుకు రామకృష్ణ నిరాకరించడంతో రాయచోటిలోని తన నివాసంలో జస్టిస్‌ నాగార్జున రెడ్డి, అతని తమ్ముడు పవన్‌ కుమార్‌ రెడ్డి రామకృష్ణను దుర్భాషలాడటమే కాకుండా బూటు కాలుతో తన్ని అవమానించారు. ఈ సంధర్భంలో వారి సంభాషణ అంతా రామకృష్ణ తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. అక్కడి నుంచి తప్పించుకున్న రామకృష్ణ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసి రశీదు తీసుకున్నారు.

తప్పుడు ఆరోపణలతో రామకృష్ణపై కేసులు..సస్పెండ్..
రామకృష్ణ తమ దారికి రాకపోవడంతో ఆగ్రహించిన జస్టిస్‌ నాగార్జున రెడ్డి.. తప్పుడు ఆరోపణలతో రామకృష్ణపై కేసులు పెట్టించారు. దీనిపై నాగార్జున రెడ్డికి వ్యతిరేకంగా రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోగా.. రామకృష్ణను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ఈ మొత్తం వ్యవహరాన్ని రామకృష్ణ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా చట్టపరంగా ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పింది. ఒక జడ్జిని పదవీ నుంచి తొలగించాలని రాష్ట్రపతికి సిఫార్సు చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉండటంతో రాజ్యసభ సభ్యులైన సీతారాం ఏచూరిని రామకృష్ణ ఆశ్రయించారు.

చర్చకు రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఆమోదం
రామకృష్ణ ఇచ్చిన రికార్డులన్నింటినీ పరిశీలించిన సీతారాం ఏచూరి.. మహాభియోగ తీర్మానాన్ని రాజ్యసభ ముందుకు తీసుకువచ్చారు. ప్రధానంగా మూడు అభియోగాలను నోటీసులో పేర్కొన్నారు. దళిత జడ్జిపై దాడి చేయడం.. అధికార దుర్వినియోగానికి పాల్పడటం.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగాలు ఉన్నాయి. దీనిపై చర్చకు రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఆమోదం తెలిపారు. 

Don't Miss