బ్లాక్‌ దొంగల బాగోతం

22:01 - December 8, 2016

హైదరాబాద్ : సామాన్యుడు ఒకేఒక్క... రెండు వేల రూపాయల నోటు కోసం.. రోజుల కొద్దీ క్యూలైన్‌లో నించుంటుంటే.. పాలకవర్గానికి చెందిన పెద్దలు మాత్రం.. కోట్లకొద్దీ నల్లధనాన్ని కొత్త నోట్లలోకి మార్చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు శేఖరరెడ్డి వద్ద లభించిన భారీ పైకమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. అవును.. ఒకటికాదు రెండు కాదు... ఏకంగా 70కోట్ల రూపాయల కొత్తనోట్లు... వందకిలోల బంగారం... 20కోట్ల రూపాయల పాత నగదు.. 400కోట్ల విలువైన దస్తావేజులు... శేఖరరెడ్డి అతని స్నేహితుల వద్ద లభించింది. ఈ సంపదను చూసి ఐటీ అధికారులే నివ్వెరపోయారు.. ఇదంతా ఎలా సంపాదించారోనన్న వివరాలు ఆరా తీస్తున్నారు. 
బ్లాక్‌ దొంగల బాగోతం 
పెద్దనోట్ల రద్దుతో నల్లధనం మొత్తం బయటకు వస్తుందని కమలనాథులు విపరీతమైన ప్రచారం చేశారు. అయితే.. ఇప్పుడు అదంతా ఒట్టిదేనని తేలుతోంది. నిన్నటికి నిన్న గాలి జనార్దనరెడ్డి వంద కోట్ల రూపాయల పాతనోట్లను కొత్తనోట్లుగా మార్చుకున్నట్లు బయటపడితే.. తాజాగా టీటీడీ బోర్డు సభ్యుడు శేఖరరెడ్డి ఏకంగా 70 కోట్ల రూపాయల పాత నోట్లను కొత్తనోట్లతో మార్పిడి చేసుకున్నట్లు వెలుగు చూసింది. ఆదాయపన్నుశాఖ దాడులతో బ్లాక్‌ దొంగల బాగోతం బయట పడింది. 
తెలుగు బడా పారిశ్రామికవేత్తల ఇళ్లలో ఐటీ రెయిడ్స్
చెన్నైలోని తెలుగు బడా పారిశ్రామికవేత్తలు శేఖర్‌ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ప్రేమ్‌ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లెక్కలు చూపని 90 కోట్ల నగదు, వందకిలోల బంగారు ఆభరణాలు, 400 కోట్ల రూపాయల విలువైన దస్తావేజులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అన్నానగర్‌, టి. నగర్‌ సహా 8 చోట్ల జరిపిన ఈ సోదాల్లో 60మంది ఐటీ అధికారులు పాల్గొన్నారు.. ముగ్గురు పారిశ్రామికవేత్తలను అదుపులోనితీసుకున్న వివరాలు సేకరిస్తున్నారు.. శేఖరరెడ్డి వద్ద పట్టుబడిన 90 కోట్ల నగదులో.. 70 కోట్ల మేర కొత్త నోట్లే ఉండడం.. పెద్దనోట్ల రద్దు ఎంత ప్రహసనంగా మారిందో తేటతెల్లం చేస్తోంది. 
రూ. 70కోట్ల కొత్తనోట్లు, రూ. 20కోట్ల పాతనోట్లు లభ్యం
కొత్తనోట్ల దొరక్క సామాన్యులు ఇబ్బందిపడుతుంటే ఈ వ్యాపారుల వద్దకు ఏకంగా 70కోట్ల రూపాయల కొత్త నోట్లు ఎలా వచ్చాయన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంకు అధికారులు ఎవరైనా సహకరించారా అన్నకోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.. టీటీడీ సభ్యుడిగా ఉన్న శేఖర్‌ రెడ్డి.. తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇసుక, గనుల వ్యాపారాలు చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్‌ గార్డెన్‌ లోకి సులువుగా వెళ్లగలిగే అతికొద్ది మందిలో శేఖర్ రెడ్డి ఒకరని కొందరు నేతలు చెబుతున్నారు.. శేఖర్ రెడ్డి తమిళనాడులో వెయ్యి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేస్తున్నట్లు సమాచారం.

 

Don't Miss