శశికళ చక్రం తిరిగేనా?..

07:16 - December 7, 2016

తమిళనాడు : జయలలిత అంత్యక్రియల్లో క్రియాశీలక పాత్రను పోషించారు..ఆమె నెచ్చెలి శశికళ నటరాజన్‌. జయలలిత మృతదేహం పక్కనే ఉండి అన్నీ తానై ముందుకు నడిపించారు. జయకు నివాళులర్పించడానికి వచ్చినవారు సైతం శశికళనే పరామర్శించారు. చివరకు అంత్యక్రియలు కూడా ఆమెనే నిర్వహించారు. జయలలిత స్థానంలో శశికళ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చక్రం తిప్పనున్నారా?

పాతికేళ్లుగా జయలిత..శశికళల మధ్య స్నేహం
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శశికళ నటరాజన్‌ల మధ్య స్నేహ బంధం పాతికేళ్లుగా కొనసాగుతోంది. మధ్యలో విభేదాలు తలెత్తినా...జయలలిత నెచ్చెలి లేకుండా ఉండలేకపోయారు. పార్టీలో...ప్రభుత్వంలో తెరచాటు రాజకీయాలు నడుపుతూ శశికళ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. చివరి వరకు జయలలితకు నీడలా వెన్నంటే ఉన్నారు.

జయలలిత అంత్యక్రియల్లో కేంద్ర బిందువుగా శశికళ
జయలలిత అంత్యక్రియల్లో శశికళే కేంద్ర బిందువయ్యారు. ప్రజల సందర్శనార్థం జయలలిత మృత దేహాన్ని రాజాజీ పబ్లిక్‌ హాలులో ఉంచారు. శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు జయలలిత మృతదేహం పక్కనే ఉన్నారు.

జయకు ప్రముఖుల నివాళి
రాజకీయ ప్రముఖులు, సినీ నటులు, అధికారులు, విఐపిలంతా జయలలితకు నివాళులర్పించారు. వచ్చిన ప్రముఖులంతా శశికళను ఓదార్చారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోది సైతం శశికళను ఓదార్చడం కనిపించింది.

జయలలిత అంత్యక్రియలు కూడా శశికళే నిర్వహించారు.
జయలలిత మరణించినట్లు ప్రకటించిన తర్వాత నమ్మిన బంటు పన్నీర్‌ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. పన్నీర్‌ సెల్వం సిఎం ఎంపిక వెనక శశికళ హస్తం ఉన్నట్లు సమాచారం. పన్నీర్‌ సెల్వం ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేలలో ఏకాభిప్రాయం లేదని తెలుస్తోంది.పాతికేళ్ల పాటు జయలలిత కనుసన్నలలో మెలిగిన శశికళ- అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ ఎలాంటి పదవి చేపట్టకపోవడం గమనార్హం. కేవలం సలహాలకై పరిమితమయ్యారు. ఇన్నాళ్లూ తెర వెనక రాజకీయాలు నడిపిన శశికళ- అధికారాన్ని హస్తగతం చేసుకునేందు జయ స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

శశికళను వెంటాడిన అవినీతి కేసులు
అయితే శశికళను కూడా అవినీతి కేసులు వెంటాడం రాజకీయంగా ఇబ్బంది కలిగించేదే. భూ ఒప్పందాలు, అక్రమ ఆస్తులకు సంబంధించిన ఆరోపణల దృష్ట్యా పార్టీలో అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశముందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జయలలిత ఆసుపత్రిలో ఉండగా శశికళతో పాటు పన్నీర్‌ సెల్వం, ప్రభుత్వ సలహాదారు, మాజీ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్‌ పవర్‌ సెంటర్‌గా మారడంతో మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది.

1980లో జయలలితకు పరిచయం అయిన శశికళ
వీడియో షాపును నడిపే శశికళ 1980లో జయలలితకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి జయలలిత జీవితంలో, పోయెస్‌ గార్డెన్‌లో ఆమె పర్మనెంట్‌గా స్థిరపడ్డారు. 1995, 2011లో అభిప్రాయ భేదాలు రావడంతో జయలలిత శశికళను కుటుంబంతో సహా ఇంటి నుంచి పంపేశారు. నాలుగు నెలల్లోనే తిరిగి శశికళను జయలలిత ఇంటికి రప్పించుకున్నారు.

Don't Miss